టీడీపీ మేనిఫెస్టోపై ఎన్నికల సంఘానికి ఫిర్యాదు
విజయవాడ: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుపై వైయస్ఆర్‌సీపీ ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేసింది. పార్టీలకు అతీతంగా జరిగే పంచాయతీ ఎన్నికలకు టిడిపి మేనిఫెస్టో ను విడుదల చేయడాన్ని వైయస్ఆర్‌సీపీ తీవ్రంగా తప్పు పట్టారు. చంద్రబాబు పై చర్యలు తీసుకోవాలని వైయస్ఆర్‌సీపీ నేతలు వినతిపత్రం అందజేశారు.
ఎన్నికల ప్రవర్తనా నియమావళికి విరుద్ధంగా చంద్రబాబు మేనిఫెస్టోను విడుదల చేశారని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, అధికార ప్రతినిధి మూర్తి పేర్కొన్నారు. చంద్రబాబు పై చర్యలు తీసుకోవడానికి ఎన్నికల సంఘం ఉపక్రమించవలసిందిగా వారు ఫిర్యాదు ద్వారా విజ్ఞప్తి చేశారు. పంచాయతీ ఎన్నికల నేపథ్యంలో పార్టీ ప్రణాళికను తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబు నిన్న విడుదల చేసిన విషయం తెలిసిందే.
నిబంధనలకు విరుద్ధంగా మేనిఫెస్టో విడుదల చేసిన టీడీపీ అధినేత చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు విడుదల చేసిన ఎన్నికల మేనిఫెస్టోపై నిమ్మగడ్డ స్పందించడం లేదని ఘాటుగా విమర్శించారు. చంద్రబాబు ఎన్నికల నియమావళిని ఉల్లంఘించారని ఆరోపించారు. సీఈసీ ప్రభుత్వ యాప్‌ను పక్కనబెట్టి తన సొంత యాప్ రంగంలో దించడం సముజసం కాదని హితవు పలికారు. తక్షణమే చంద్రబాబుపై కేసు నమోదు చేయాలని అప్పిరెడ్డి డిమాండ్ చేశారు.