దెంద‌లూరులో వైయ‌స్ఆర్‌సీపీ నేతల‌ అరెస్ట్ 

25 Jul, 2025 12:16 IST

ఏలూరు: ఆంధ్ర‌ప్ర‌దేశ్ రాష్ట్రంలో రెడ్‌బుక్‌ రాజ్యాంగం రాజ్యమేలుతోంది. వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, వారి కుటుంబ సభ్యులే టార్గెట్‌గా అక్రమ కేసులు నమోదు చేస్తూ.. అరెస్ట్‌లు జరుగుతున్నాయి. తాజాగా దెందులూరు నియోజకవర్గంలోమాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరి సోదరుడు సహా పలువురిని అక్రమ కేసుల్లో పోలీసులు అరెస్ట్‌ చేశారు.  

దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారి అబ్బయ్య చౌదరి సోదరుడు  చల్లగోళ్ళ తేజ, చల్లగోళ్ళ ప్రదీప్‌ని పోలీసులు  అదుపులోకి తీసుకున్నారు. అలాగే, ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు కామిరెడ్డి నానిని సైతం పోలీసులు అరెస్టు చేశారు. అయితే, ఏ కేసులో వారిని అరెస్ట్‌ చేస్తున్నారని పార్టీ నేతలు, కుటుంబ సభ్యులు ప్రశ్నించగా.. పోలీసులు మాత్రం సమాధానం చెప్పలేదు. అనంతరం, వారిని ఏలూరు రూరల్ పోలీస్ స్టేషన్‌కు త‌ర‌లించారు.

గతంలోనే దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ మీడియా సమక్షంలోనే కామిరెడ్డి నానిని కచ్చితంగా జైలుకు పంపుతానని సవాల్ చేసిన విషయం తెలిసిందే. ఇందులో భాగంగానే నానిని అరెస్ట్‌ చేసినట్టు తెలుస్తోంది. వైయ‌స్ఆర్‌సీపీ నేతల అరెస్ట్‌పై పార్టీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇలా అక్రమ కేసులు ఎంత మందిపై పెడతారని ప్రశ్నిస్తున్నారు.