వివేకానంద రెడ్డి హఠాన్మరణం దిగ్భ్రాంతికరం
హైదరాబాద్: మాజీ మంత్రి వైయస్ వివేకానంద రెడ్డి అకాల మరణంపై వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎంపీ విజయసాయిరెడ్డి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. ‘వైయస్ వివేకానంద రెడ్డి హఠాన్మరణం దిగ్భ్రాంతికరం. తీవ్ర విచారకరం. ఆయన అకాల మరణం పార్టీకి తీరని లోటు. వారి ఆత్మకు శాంతి చేకూరాలని కోరుకుంటూ ఆయన కుటుంబసభ్యులకు నా ప్రగాఢ సంతాపం, సానుభూతిని తెలియచేస్తున్నా.’ అని విజయసాయిరెడ్డి పేర్కొన్నారు. వైయస్ వివేకానంద రెడ్డి మృతిపై తీవ్ర దిగ్భ్రాంతికి గురైన వైయస్ఆర్‌సీపీ నేతలు ఆయన అకాల మరణంపై సంతాపం వ్యక్తం చేస్తున్నారు. విజయనగరం మాజీ ఎంపీ బొత్స ఝాన్సీ లక్ష్మీ, నగరి ఎమ్మెల్యే రోజా, తిరుపతి మాజీ ఎంపీ వరప్రసాద రావు, మాజీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి, మాజీ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి, తెలంగాణ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గట్టు శ్రీకాంత్ రెడ్డిలు తమ సంతాపాన్ని తెలియజేశారు. వైయస్ఆర్ సీపీ ఓ మంచి నేతను కోల్పోయిందని వరప్రసాద్ రావు పేర్కొన్నారు.