వైయస్ జగన్ ప్రజాదరణ చూసి ఓర్వలేక కుట్ర

చిత్తూరు: వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డికి ప్రజల నుంచి వస్తున్న ఆదరణ చూడలేక కూటమి ప్రభుత్వం కుట్ర చేస్తుందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. జగనన్న ఎక్కడకు వెళ్లినా సముద్రంలా జనప్రవాహం వస్తోందన్నారు. సోమవారం ఆమె ఓ వీడియో విడుదల చేశారు.
ఇంకా ఆమె ఎమన్నారంటే...
రాప్తాడు, పొదిలి, సత్తెనపల్లిలో వైయస్ జగన్ పర్యటనకు జనం ఒక సముద్రంలా ఆయన వెంట నడిచారు. దీనితో ఆయన పర్యటించిన ప్రతి ప్రాంతంలోనూ స్థానిక నాయకత్వంపైన కూటమి ప్రభుత్వం తప్పుడు కేసులు బనాయించి వేధింపులకు గురిచేసింది. జూన్ 18న సత్తెనపల్లిలో వైయస్ జగన్ పర్యటించారు. అదే ప్రాంతంలో దురదృష్టవశాత్తు సింగయ్య అనే వ్యక్తి ప్రమాదవశాత్తు మృతి చెందితే దానిని రాజకీయం చేసేందుకు కూటమి ప్రభుత్వం సిగ్గులేకుండా కుట్రకు సిద్దపడింది. మంత్రులు పయ్యావుల కేశవ్, అనిత ప్రెస్‌మీట్లలో ఆ ప్రమాదాన్ని వైయస్ జగన్‌కు ఆపాదిస్తూ మాట్లాడిన తరువాతే పోలీసులు ఈ అక్రమ కేసులను బనాయించారు. ఈ ఘటనపై 18వ తేదీన పల్నాడు జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఒక ప్రైవేటు వాహనం డీ కొట్టడం వల్లే సింగయ్య చనిపోయారని మీడియా ముందు ప్రకటించారు. అలాగే ఆ కారు నెంబర్, దాని యజమానుల వివరాలను వెల్లడించారు. వారిపైన కేసులు కూడా పెడుతున్నట్లు తెలిపారు. తరువాత మంత్రులు మీడియా ముందు వైయస్ జగన్ పై ఆరోపణలు చేయగానే నాలుగు రోజుల తరువాత ఆయన తన మాటను మార్చేశారు.
ఆది నుంచి ఇదే విధంగా కుట్రలు
గతంలో ఇదే విధంగా తిరుపతి శ్రీవారి లడ్డూ ప్రసాదంలో కల్తీ నెయ్యి కలిసిందంటూ ఒక తప్పుడు ప్రచారాన్ని పెద్ద ఎత్తున ప్రజల్లోకి తీసుకువెళ్ళే ప్రయత్నం చేశారు. తరువాత ఆధారాలు చూపించలేక సిగ్గుతో తలదించుకున్నారు. ఇప్పుడు ఈ కారు ప్రమాదం గురించి కూడా ఇదే పంథాలో కుట్రకు సిద్దపడ్డారు. వీరి కుట్రలు ఎంతలా ఉన్నాయంటే వీరు చేస్తున్న ఆరోపణలే నిజమని అనుకోవాల్సి వస్తే, ఈ ప్రమాదంకు కారణమైన కారు డ్రైవర్ పై కేసు పెడతారా? లేక కారులో ప్రయాణించిన వైయస్ జగన్‌పై కేసు పెడతారా? దీనిని బట్టే వారి ఉద్దేశం అర్థమవుతోంది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం చేస్తున్నదే సరైనదైతే ఇటీవల అహ్మదాబాద్‌లో విమానం కూలిపోయింది. అందులో ప్రయాణిస్తున్న మొత్తం ప్రయాణీకులు చనిపోయారు. దీనికి బాధ్యత వహిస్తూ ఏవియేషన్ మంత్రి రామ్మోహన్‌నాయుడిపైన ఎందుకు కేసు పెట్టలేదు. ఇటీవల సింహాచలంలో గోడకూలి ఏడుగురు మృతి చెందితే, ఆ ఏర్పాట్లను పర్యవేక్షించిన హోమంత్రి అనితపైన ఎందుకు కేసు పెట్టలేదు? గేమ్‌ఛేంజర్ సినిమా ఫంక్షన్‌లో పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ యువతకు ఉద్యోగాలు ఇవ్వలేకపోతున్నాం, యువత ఎనర్జీ ఎక్కువ ఉంది కాబట్టి సెలెన్సర్‌లు తీసేసి, బైక్‌లు రైజ్ చేస్తూ వెళ్ళమని పిలుపు ఇవ్వడంతో, అభిమానాలు దానినే పాటిస్తూ వెళ్ళి ఇరువురు చనిపోయారు. దీనికి గానూ పవన్ కల్యాణ్‌పై ఎందుకు కేసు నమోదు చేయలేదు? ఏదో ఒక విధంగా కేసులు పెట్టి ఈ రాష్ట్రం వైయస్ జగన్ ఒక్కడికీ పర్యటించకూడదనేదే కూటమి ప్రభుత్వ లక్ష్యం. కోవిడ్ సమయంలో వైయస్ జగన్ ప్రతి కుటుంబాన్ని సొంత కుటుంబంగా భావించారు. ఈ దేశంలో ఏ ప్రభుత్వం చేయనంతగా పరీక్షలు చేయడం, మెడికల్ కిట్స్, వైద్య సేవలు అందించి, ప్రతి ప్రాణాన్ని కాపాడేందుకు ప్రయత్నించారు. సంక్షేమ పథకాలతో పేదలకు అండగా నిలిచారు. ఆయనకు ఎంత మానవత్వం ఉందో రాష్ట్ర ప్రజలకు తెలుసు. మానవత్వం అంటే తెలియని రెడ్‌బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నది చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్‌లు.