నారా వారి లిక్కర్ కమీషన్లు రూ.10 వేల కోట్లు
ప్రొద్దుటూరు: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అమలు చేస్తున్న లిక్కర్ పాలసీ ద్వారా కోట్లాధి రూపాయలు అక్రమంగా అమరావతిలోని చంద్రబాబు కరకట్ట ప్యాలెస్‌కు చేరుతున్నాయని వైయస్ఆర్‌సీపీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్‌రెడ్డి అన్నారు. ప్రొద్దుటూరులో మీడియాతో మాట్లాడుతూ ప్రతిఏటా నారావారి లిక్కర్ కమీషన్లు అక్షరాలా రూ.2,200 కోట్లు అని అన్నారు. డిస్టిలరీల నుంచి ఏడాదికి రూ.1000 కోట్లు సీఎం చంద్రబాబుకు, లిక్కర్ షాప్‌ల నుంచి ఆయన కుమారుడు నారా లోకేష్‌కు రూ.1200 కోట్లు ముడుపులు అందుతున్నాని వెల్లడించారు. అయిదేళ్లలో ఏకంగా రూ.10వేల కోట్లకు పైగా లిక్కర్ ద్వారా దండుకుంటూ అతిపెద్ద స్కామ్‌ను నడిపిస్తున్న ఘనులు తండ్రీకొడులని ధ్వజమెత్తారు.
ఇంకా ఆయనేమన్నారంటే...
ప్రొద్దుటూరు నియోజకవర్గంలో 40 మద్యం షాపులు, 10 బార్లుంటే, ప్రతినెలా ఒకటో తారీఖున ప్రతి మద్యం షాపు నుంచి ఎక్సైజ్ డిపార్ట్‌మెంట్‌కి రూ. 70 వేలు, పోలీస్ స్టేషన్‌కి రూ. 30 వేలు అందుతున్నాయని స్థానిక ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి స్వయంగా వెల్లడించారు. దీని ప్రకారం కడప మొత్తంమీద 500 మద్యం షాపులుంటే రూ.5 కోట్లు చొప్పన ప్రతినెలా అమరావతికి మామూళ్ళు చేరుతున్నాయి. ఇలా ఒక్క జిల్లా నుంచే ప్రతినెలా రూ.5 కోట్లు ముడుపులుగా నారా వారికి చేరుతుంటే, మిగిలిన జిల్లాల నుంచి ఎంత వసూలు చేస్తున్నారో అర్థం చేసుకోవచ్చు. రాష్ట్రంలో చీప్ లిక్కర్, ఓల్డ్ అడ్మిరల్ బ్రాందీ (ఓఏబీ) కలిపి 60 నుంచి 70 శాతం వరకు తాగుతున్నారు. ఇది గత ప్రభుత్వంలో రూ. 140 లకు అమ్మితే, కూటమి ప్రభుత్వం రూ. 130కి అమ్ముతున్నారు. వైట్ హాల్ అనే బ్రాందీని గత ప్రభుత్వంలో రూ. 150కి అమ్మితే, ఇప్పుడు కూటమి పాలనలో రూ. 10లు పెంచి రూ. 160కి అమ్ముతున్నారు. కింగ్స్ వెల్ అనే బ్రాందీని గత ప్రభుత్వం రూ. 150కి అమ్మితే, ఇప్పుడు రూ. 160 కి అమ్ముతున్నారు. ఆఫీసర్స్ చాయిస్ గతం కన్నా రూ. 10 లు పెంచి రూ. 160కి అమ్ముతున్నారు. బ్లాక్ లేబుల్, బర్డ్ వైజర్, కర్జూర, కింగ్ ఫిషర్ బీర్లు కూడా గతంలో అమ్మిన ధరలకే అమ్ముతున్నారు. మొత్తంగా చూస్తే చంద్రబాబు వచ్చాక లిక్కర్ ధరలు ఒక్క రూపాయి కూడా తగ్గించకపోగా, ఎక్కువ మంది తాగే బ్రాండ్ మద్యం ధరలను మాత్రం పెంచి విక్రయిస్తున్నారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వం అన్ని బ్రాండ్లు అమ్మలేదనేది కూటమి ప్రభుత్వం చేస్తున్న మరో ప్రధాన ఆరోపణ. గత ప్రభుత్వంలో మెడ్ డొవెల్ విస్కీ, బ్రాందీ, రాయల్ చాలెంజ్, ఇంపీరియల్ బ్లూ ఈ 3 బ్రాండ్లను మాత్రమే ఎక్కువగా అమ్మలేక పోయాం. పొద్దున దొరికింది రాత్రి దొరకలేదు. రాత్రి దొరికింది పొద్దున్న ఉండటం లేదని మందుబాబులను చంద్రబాబు రెచ్చగొట్టాడు. ఇప్పుడు కూటమి ప్రభుత్వం కూడా అదే చేస్తోంది. చంద్రబాబు చెప్పే నాణ్యమైన రూ. 99 ల మద్యం రోజూ దొరకడం లేదు. ఎప్పుడూ ఒకే బ్రాండ్ తాగాలనుకునే వారికి అందుబాటులో ఉండటం లేదు. ఒకరోజు షాట్, ఒకరోజు బిన్ని, ఒకరోజు ట్రోఫీ, ఒకరోజు కేరళ, ఇంకోరోజు బెంగళూరు పేరుతో నచ్చిన బ్రాండ్‌ను, నచ్చిన టైమ్‌లో అమ్ముతున్నారు. 365 రోజులు ఒకే బ్రాండ్ దొరకడం లేదు. నాణ్యమైన మద్యం పేరుతో చంద్రబాబు అమ్ముతున్న చీప్ లిక్కర్‌లో స్పిరిట్ కలుపుతున్నారు. దాన్ని తాగితే ప్రాణాలు కోల్పోవడం తథ్యం.
రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యం
కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత నాణ్యతతో కూడిన మద్యాన్ని తక్కువ ధరకు ఇస్తానని చంద్రబాబు హామీ ఇచ్చి మందు బాబులను మోసం చేశాడు. కానీ వాస్తవం చూస్తే గత ప్రభుత్వంలో ఏదైతే మద్యం దొరికిందో ఇప్పుడూ అదే మద్యం అదే ధరకు విక్రయిస్తున్నారు. కానీ గత ప్రభుత్వం అమ్మినప్పుడు దాన్ని విషం అని ప్రచారం చేశారు. మందుబాబుల బలహీనతను, వ్యసనాన్ని ఆసరాగా తీసుకుని ఓటేయించుకుని ఇప్పుడు వారి జేబుల్లోంచి నోట్లు లాక్కుంటున్నాడు. చంద్రబాబులా నాడు వైయస్ జగన్ లాభాపేక్షతో ఆలోచించలేదు. ప్రజల ఆరోగ్యం కుటుంబ సంక్షేమం గురించి ఆయన మదనపడ్డాడు కాబట్టే, మద్యం షాపులు తగ్గించారు. అధికారంలోకి వచ్చాక మద్యం తాగాలంటే ధరలు షాక్ కొట్టేలా పెంచుతానని చెప్పారు. అలాగే పెంచారు. మా హయాంలో బెల్ట్ షాపులు ఎత్తేస్తే, కూటమి ప్రభుత్వం వచ్చాక మళ్లీ వీధికో బెల్ట్ షాపులు తెరుచుకున్నాయి. కుటుంబాలు ఆర్థికంగా చితికిపోతున్నాయి. 2019-24 మధ్య ఎక్కడైనా బెల్ట్ షాపు ఉందని నిరూపిస్తే మళ్లీ ఎన్నికల్లో పోటీ చేయనని సవాల్ విసురుతున్నా. ఇప్పుడు పల్లెల్లో కూడా మంచినీళ్ల కన్నా వేగంగా ఇంటికి మద్యం డోర్ డెలివరీ చేస్తున్నారు. మేము మద్యం అమ్మకం వేళలు తగ్గిస్తే, ఇప్పుడు 24 గంటలూ మద్యం షాపులు తెరిచి, ఎమ్మార్పీ కంటే ఎక్కువ ధరలకు అమ్ముతున్నారు. విచ్చలవిడిగా మద్యం తాగించి ఆరోగ్యం పాడు చేస్తున్నారు. ఇదంతా ఏపీలో మద్యం తాగే ప్రతి ఒక్కరికీ తెలుసు.
రాజకీయ కక్షతోనే లేని మద్యం పాలసీని సృష్టించారు
కూటమి ప్రభుత్వం ఏర్పాటైన పది రోజులకే మద్యం పాలసీలో అక్రమాలు జరిగాయని జరిగాయని, వైయస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.3200 కోట్లు దోచుకున్నారని చంద్రబాబు ఆరోపణలు చేశారు. వైయస్ జగన్ మీద రాజకీయ కక్షతో ఆయనకు అండగా ఉన్నవారిని, ఆయనకు దగ్గరగా పనిచేసిన వారిని తప్పుడు కేసులతో ఇబ్బంది పెట్టడమే ఈ ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. అందుకు అనుగుణంగా ఎవరెవర్ని అరెస్టులు చేయాలో ముందుగానే ఒక ప్రణాళిక రూపొందించుకున్న చంద్రబాబు, లిక్కర్ కేసులో ఇప్పటికే ఏడుగురిని అరెస్ట్ చేయించారు. అందులో భాగంగానే నిన్న వైయస్ జగన్ కు కార్యదర్శిగా చేసిన ధనుంజయరెడ్డి, ఓయస్డీగా ఉన్న కృష్ణమోహన్‌రెడ్డిలను అరెస్ట్ చేశారు. మద్యం పాలసీతో ఏ సంబంధం లేని అధికారులను కక్షపూరిత విధానాలతో వేధింస్తున్నారు. వారిని ఎందుకు అరెస్ట్ చేశారో స్పష్టం చేసే ఏ ఒక్క ఆధారం కూడా సిట్ వద్ద లేదు. ఏపీ బేవరేజెస్ కార్పొరేషన్‌లో పనిచేసే సత్యప్రసాద్ అనే చిరుద్యోగిని బెదిరించి తమకు కావాల్సిన వారిని కేసులో ఇరికించేలా తప్పుడు వాంగ్మూలం నమోదు చేయించి అరెస్టులకు దిగుతున్నారు. ఔట్ సోర్సింగ్ విధానంలో పనిచేసే అనూష అనే డీటీపీ ఆపరేటర్ ని కూడా వదలకుండా ఆమెతో తమకు కావాల్సిన స్టేట్‌మెంట్ ఇప్పించుకున్నారు. ఇన్వెస్టిగేషన్ పేరుతో కేసుకి సంబంధం లేని అధికారులను సైతం జైళ్లకు పంపుతున్నారు. మొన్నటి వరకు ఐపీఎస్‌లను వేధించిన కూటమి సర్కారు, ఇప్పుడు ఐఏఎస్‌లను కూడా వదలడం లేదు. ప్రభుత్వాలు మారిన వెంటనే ఐఏఎస్‌లు, ఐపీఎస్‌లను, ఓయస్డీలను విచారణ పేరుతో నెలల తరబడి జైళ్లకు పంపించి మానసికంగా శారీరకంగా హింసిస్తే రాబోయే రోజుల్లో ఈ రాష్ట్రంలో పనిచేయడానికి ఏ అధికారైనా ముందుకొస్తాడా? అధికారులు స్వేచ్ఛగా పనిచేసే అవకాశం ఉంటుందా?
డైవర్షన్ పాలిటిక్స్‌లో భాగంగానే అరెస్ట్‌లు
రాష్ట్రంలో ఉన్న ఏ ఒక్క డిస్టిలరీకి కూడా వైయస్ జగన్ హయాంలో అనుమతి లభించలేదు. గతంలో 4 డిస్టిలరీలకు కాంగ్రెస్ హయాంలో అనుమతిస్తే, మిగిలిన వాటన్నింటికీ చంద్రబాబే అనుమతిచ్చారు. దాదాపు 200 బ్రాండ్లు తయారు చేసే డిస్టిలరీలన్నీ చంద్రబాబు హయాంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. అలాంటిది డిస్టిలరీల నుంచి వైయస్ జగన్ లంచాలు తీసుకున్నాడని పచ్చి అబద్ధాలు చెప్పి చంద్రబాబు ప్రజలను నమ్మించాడు. సూపర్ సిక్స్ అని చెప్పుకునే ఆరు పథకాలు అమలు చేయలేని అసమర్థుడు చంద్రబాబు. చంద్రబాబుకి పరిపాలన చేతకాక మా నాయకులపై అక్రమ కేసులు పెట్టి జైళ్లకు పంపుతున్నాడు. పాలనా వైఫల్యాలను కప్పి పుచ్చుకునేందుకు రోజుకో డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నాడే కానీ, సంక్షేమ పథకాలు అమలు చేయాలన్న ఆలోచన చేయడం లేదు.