నూతన ఒరవడి సృష్టించేందుకు బీసీ డిక్లరేషన్
పశ్చిమగోదావరి: బీసీ సామాజిక వర్గాలకు నూతన ఒరవడిని చూపించేందుకు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి బీసీ డిక్లరేషన్ ప్రకటించనున్నారని వైయస్‌ఆర్ సీపీ సీనియర్ నేత మోపిదేవి వెంకటరమణ అన్నారు. చంద్రబాబు పాలనలో నష్టపోని వర్గం లేదని, అన్ని వర్గాలను మోసం చేసిన వ్యక్తి చంద్రబాబు అన్నారు. ఏలూరు బీసీ గర్జనలో పాల్గొని ఆయన మాట్లాడుతూ.. రిజర్వేషన్ల పేరుతో మోసం చేశారని మండిపడ్డారు. కుల రిజర్వేషన్ల పేరుతో, తాత్కాలిక ప్రయోజనాల పేరుతో మరోసారి మోసం చేయడానికి చంద్రబాబు సిద్ధమవుతున్నారని, మాయమాటలు నమ్మి మోసపోవద్దన్నారు. బీసీల స్థితిగతులు అధ్యయనం చేసి, జీవన ప్రమాణాలు మార్చడానికి పటిష్టమైన ప్రణాళికతో వైయస్ జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు. దివంగత మహానేత వైయస్ రాజశేఖరరెడ్డి పాలనలో బీసీలు ఎలా తలెత్తుకు బతికారో.. అంతకు రెట్టింపు జీవన విధానాన్ని కల్పించేందుకు వైయస్ జగన్ సిద్ధంగా ఉన్నారన్నారు. రాబోయే ఎన్నికల్లో వైయస్ జగన్‌కు అండగా ఉంటూ.. మోసం చేసిన తెలుగుదేశం పార్టీకి బుద్ధి చెప్పాలని కోరారు.