వైయస్ జగన్ పొదిలి పర్యటనలో పోలీస్ భద్రతా వైఫల్యం
తాడేపల్లి: మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్ పొదిలి పర్యటనలో అడుగడుగునా పోలీస్ భద్రతా వైఫల్యం కనిపించిందని మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్‌రెడ్డి మండిపడ్డారు. తాడేపల్లి వైయస్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ పొగాకు రైతులకు భరోసా కల్పించేందుకు వెడుతున్న వైయస్ జగన్‌కు సీఎం చంద్రబాబు ఆదేశాల మేరకే పోలీసులు ఉద్దేశపూర్వకంగా భద్రత విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఒక ఫ్యాక్షన్ మనస్తత్వంతో రాష్ట్రంలో పాలన సాగిస్తున్నారని ధ్వజమెత్తారు.
ఇంకా ఆయనేమన్నారంటే...
ఫ్యాక్షనిస్ట్ ఆలోచనలతో చంద్రబాబు పాలన సాగిస్తున్నారు. ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే నియంతలా మారి అణగదొక్కాలని చూస్తున్నాడు. వైయస్ జగన్‌ని అడ్డుకోవడం నాడు కేంద్రంలో అధికారంలో ఉన్న సోనియాగాంధీ వల్లే కాలేదు. ఈ చంద్రబాబు వల్ల అసలు కాదు. సూపర్ సిక్స్ హామీలు అన్నీ అమలు చేసేదాకా ప్రజల పక్షాన నిలబడి వైయస్సార్సీపీ పోరాడుతుంది. చిల్లర రాజకీయాలను ఆపేసి ప్రజా సమస్యల పరిష్కారం వైపుగా ఆలోచించాలి. శాంతి భద్రతల పరిరక్షణపై ప్రభుత్వం దృష్టిసారించాలి. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజల పక్షాన నిలబడే నాయకులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి. ప్రతిపక్ష నాయకుడిగా వందకు వంద శాతం ప్రజలకు అండగా నిలుస్తూ న్యాయం చేస్తున్నారు. వైయస్ జగన్ వస్తేనే మా సమస్యలపై ప్రభుత్వం కళ్లు తెరుస్తుందని రైతులతో పాటు అన్ని వర్గాలు కోరుకుంటున్నాయి. కాబట్టే నిన్న పొగాకు రైతుల కోసం పొదిలి వెళితే వేలాదిగా రైతులు, మహిళలు, యువత స్వచ్ఛందంగా తరలివచ్చారు. పొదిలి నగరం జనసముద్రాన్ని తలపించింది. తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు, నాయకులు, టీడీపీ సానుభూతిపరులు కూడా జగన్ రాకను స్వాగతించారు.
దాడులు చేస్తుంటే పోలీసుల ప్రేక్షకపాత్ర
పొగాకు రైతుల సమస్యలను తెలుసుకోవడానికి పొదిలికి వచ్చిన మాజీ సీఎం జగన్ కి జెడ్ ప్లస్ కేటగిరీ భద్రత ఉన్నా ఈ ప్రభుత్వం కనీస భద్రత కల్పించలేదు. ఆయన ప్రజా సమస్యల మీద గళమెత్తడానికి ఎక్కడికి వెళ్లినా అభిమానులు, ప్రజలు వేలాదిగా తరలివస్తున్నారు. కానీ భద్రత విషయంలో ప్రభుత్వం ఉదాసీనంగానే వ్యవహరిస్తోంది. గతంలో సత్యసాయి జిల్లా రామగిరి వెళ్లినప్పుడు, ఇటీవల తెనాలి వెళ్లినప్పుడు, అంతకుముందు గుంటూరు మిర్చి యార్డ్‌కి వెళ్లినప్పుడు, నిన్న పొదిలి వెళ్లినప్పుడూ ఉద్దేశపూర్వకంగానే ఎక్కడా ఆయనకు సరైన పోలీస్ భద్రత కల్పించడం లేదు. మరోవైపు వైయస్ జగన్ పర్యటనలపై విషం చిమ్మేందుకు నిరసనల పేరుతో తెలుగుదేశం పార్టీ కొత్తరకం కుట్రలకు తెరలేపుతోంది. జగన్ ని చూడటానికి 40 వేల మంది ప్రజలు తరలివస్తే ఆయనకు నామ్ కే వాస్తే భద్రత కల్పించారు. నిరసనల పేరుతో రైతులు, మహిళల ముసుగులో 40 మంది టీడీపీ కార్యకర్తలను మోహరించి వారికి 200 మంది పోలీసుల భద్రత కల్పించారు. రైతుల సమస్యలపై మాట్లాడుతుంటే ఈ ప్రభుత్వం ఓర్వలేక మహిళలను అడ్డం పెట్టుకుని ఇలాంటి నీచరాజకీయాలు చేస్తోంది. రాళ్లు విసురుతుంటే పోలీసులు ప్రేక్షకపాత్ర వహించారు.
రైతు సమస్యలపై ప్రశ్నిస్తుంటే కవ్వింపు చర్యలా?
భద్రత కల్పించకుండా, కవ్వింపు చర్యలకు పాల్పడుతూ ప్రభుత్వం అవమానాలకు గురిచేస్తున్నా ప్రజల కోసం మా నాయకులు వైయస్ జగన్ సంయమనం పాటిస్తున్నారు. నిన్న పొదిలి వచ్చిన మా 40 వేల మంది కార్యకర్తలు 40 మంది నిరసనకారులపై దాడి చేసి ఉంటే పరిస్థితి ఎలా ఉండేదో మీరే ఊహించుకోవచ్చు. చంద్రబాబు కోరుకున్నది కూడా అదే. ఒకరిద్దరు కార్యకర్తలకు ఏదైనా అయితే దాన్ని అడ్డం పెట్టుకుని వివాదం సృష్టించాలని తెలుగుదేశం పార్టీ కుట్ర పన్నింది. కానీ మా కార్యకర్తలు ఎంతో క్రమశిక్షణతో నడుచుకున్నారు. ఎలాంటి ప్రతిదాడులకు దిగలేదు. చేతనైతే రైతులకు న్యాయం చేయాల్సిందిపోయి, ఆయన పర్యటనలపై బురదజల్లి రాజకీయం చేయాలని చూడటం సిగ్గుచేటు. మీడియాను అడ్డం పెట్టుకుని అసత్య ప్రచారం చేయాలని చూస్తే ప్రజలు చూస్తూ ఊరుకోరు. ఇలాంటి కుట్రలకు వైయస్సార్సీపీ భయపడేది ఉండదు. మా నాయకులు వైయస్ జగన్ రైతుల పక్షాన పోరాడుతూనే ఉంటారు. ఆయన వైయస్సార్సీపీ సానుభూతిపరులైన రైతుల పక్షాన మాత్రమే పోరాడటం లేదనే విషయం గుర్తుంచుకోవాలి. తన పోరాటాలతో రైతులందరికీ మేలు జరగాలని కోరుకుంటున్నారు. దాన్ని కూడా అడ్డుకోవాలని చూడటం కూటమి నాయకుల దిగజారుడుతనానికి నిదర్శనం.
కార్యకర్తల జీవితాలను పణంగా పెడుతున్నాడు
తన కుట్ర రాజకీయాల కోసం తనని నమ్ముకున్న కార్యకర్తల జీవితాలను చంద్రబాబు పణంగా పెడుతున్నాడు. నిరసనల పేరుతో వారిని బలిపశువులను చేయడం సమంజసమా? కూటమి అవినీతి పాలనలో తప్పు చేసిన వారు దర్జాగా తప్పించుకుని తిరిగే వింతపోకడ కనిపిస్తుంది. గతంలో వైయస్సార్సీపీ పాలనలో మహిళలకు చేయూత, ఆసరా, కాపు నేస్తం, ఇళ్లపట్టాలు.. ఇలా ఎన్నో పథకాలు అందజేస్తే, చంద్రబాబు సీఎం అయ్యాక అవన్నీ ఆగిపోయాయి. సూపర్ సిక్స్‌లో ఏ ఒక్క పథకం అమలు చేయకుండానే రూ. లక్షన్నర కోట్లకుపైగా అప్పులు చేశారు. నిన్న రైతుల కోసం పోరాడటం వల్లనే హడావుడిగా తల్లికి వందనం ఇస్తామని ప్రభుత్వం ప్రకటించింది. కానీ 87 లక్షల మంది పిల్లలుంటే కేవలం 67 లక్షల మందికే ఇస్తామనడం మహిళలను వంచించడమే.