ఫ్లెక్సీలతో వార్ మొదలుపెట్టిందే చంద్రబాబు
తాడేపల్లి: రాష్ట్రంలో వైయస్ఆర్‌సీపీ నేతల ఇళ్లపై జరిగిన దాడుల్ని టీడీపీ ప్రోత్సహిస్తే, పోలీసులు దగ్గరుండి ఒత్తాసు పలికారని శాసన మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ తెలిపారు. రాష్ట్రానికి ఉన్న మంచి పేరును కాస్తా చెడగొట్టి, బీహార్ గా మారుస్తున్నారని ఆయన ఆక్షేపించారు. నెయ్యి వివాదంలో సిట్ రిపోర్ట్ పై చంద్రబాబుకు నమ్మకం లేకపోతే టీటీడీ ఈవోను ఎందుకు బదిలీ చేశారని బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. వైయస్ఆర్‌సీపీ నేతలపై జరుగుతున్న దాడులపై జాతీయ స్థాయికి వెళ్లి పోరాడతామని, ఈ మేరకు త్వరలోనే కార్యాచరణ ప్రకటిస్తామని బొత్స తెలిపారు. ప్రెస్ మీట్ లో బొత్స ఇంకేమన్నారంటే..
● టీడీపీ దాడులకు పోలీసుల ఒత్తాసు
వైయస్ఆర్‌సీపీ నేతల ఇళ్లపై జరిగిన దాడులకు అధికార టీడీపీతో పాటు పోలీసులు కూడా ఒత్తాసు పలికారు. జరగకూడనిది జరిగితే ఎవరు బాధ్యులు? డీజీపీ ఏం చేస్తున్నారు ?, మీరు చేస్తున్నది డీజీపీ ఉద్యోగం, చంద్రబాబు దగ్గర ఊడిగం కాదు.. వ్యవస్థ పట్ల ఉన్న గౌరవం కాపాడాలని అధికారుల్న కోరుతున్నాను. అంబటి రాంబాబు తాను చేసిన వ్యాఖ్యల మీద స్పందిస్తూ నా వయస్సుకు ఇది మాట్లాడటం సరికాదు, నన్ను వచ్చి తిడితే రా చూసుకుందాం అని చెప్పానని వివరణ ఇచ్చారు. అయినా దాన్ని వివాదం చేశారు. టీడీపీ వాళ్లు మాట్లాడారని మేం స్పందించాల్సిన అవసరం లేదు. పోలీసుల్ని దగ్గర పెట్టుకుని ఆయనపై దాడి చేయిస్తారా, కార్యకర్తల సాయంతో దాడులు చేస్తారా?, మాకు కార్యకర్తలు లేరా ?
● రాష్ట్రాన్ని బీహార్ లో మారుస్తున్న బాబు
తెలుగు ప్రజలకు దేశంలోనే సౌమ్యులుగా, చట్టాన్ని గౌరవిస్తారనే పేరుంది. ఇప్పుడు ఆ పేరు కాస్తా పోయింది. రాష్ట్రం మరో బీహార్ లా తయారవుతోంది. ప్రభుత్వ చేష్టల్ని ప్రజలు గమనించాలి. ఓ సమస్య వస్తే దాన్ని ఎలా డైవర్ట్ చేయాలని ఆలోచించి ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ప్రజా జీవితాల్ని ఇబ్బందిపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారు. తిరుమల లడ్డూ నెయ్యిపై వివాదం వస్తే నేనే ఈవో శ్యామలరావుతో ఎన్డీబీ రిపోర్టు తెప్పించామని చంద్రబాబే చెప్పారు కదా. సీబీఐ కూడా చెప్పింది కదా. సుప్రీంకోర్టు వేసిన సిట్ రిపోర్ట్ పై మీకు నమ్మకం లేదు. వ్యవస్ధపై మీకు నమ్మకం లేదు. చంద్రబాబు చెప్తే ఏదైనా చేసేస్తారా?, ప్రభుత్వం మీ జాగీరు కాదు.
● జనసేన,బీజేపీ మౌనమెందుకో ?
ఫ్లెక్సీలతో రాష్ట్రాన్ని రావణకాష్టం చేద్దామని అనుకుంటున్నారా చంద్రబాబూ.. కూటమిలో ఉన్న జనసేన, బీజేపీ ఎందుకు దీనిపై మాట్లాడటం లేదు. తప్పుని తప్పని చెప్పాలిగా. తప్పు జరిగితే చర్య తీసుకోండి. కోర్టుల్లో ఎలాగో తేల్చుకుంటాం. అంతే కానీ ఈ దాడులేంటి ?, అంబటి రాంబాబు ఎప్పుుడూ లైన్ తప్పి అసభ్యంగా మాట్లాడింది లేదు. అక్కడున్న వ్యక్తులు ఆయన్ను వచ్చి తిడితే రియాక్ట్ అయ్యారు. ఇంటికి వచ్చాక ఆ వ్యాఖ్యల్ని వెనక్కి తీసుకున్నారు. కేంద్రమంత్రులు తడాఖా చూపిస్తామని బెదిరించడం ఏంటి? ఇది ప్రజాస్వామ్య దేశమని గుర్తించుకోండి. తాటాకు చప్పుళ్లకు వైయస్ఆర్‌సీపీ బెదరదు. రాష్ట్రంలో పోలీసులకు మంచి పేరు ఉండేది, దాన్ని కాస్తా ఇప్పుడు చెడగొట్టారు. ఈ దాడులపై జాతీయ స్ధాయిలో ఉద్యమం చేయాలని నిర్ణయించాం. మా పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి గారితో మాట్లాడి కార్యాచరణ ఖరారు చేస్తామని బొత్స సత్యనారాయణ తెలిపారు.
● ప్రెస్ మీట్ తర్వాత మీడియా ప్రశ్నలకు సమాధానమిస్తూ బొత్స సత్యనారాయణ..
ప్రభుత్వాన్ని మేం రెచ్చగొట్టామన్నది అబద్ధం. పెట్రోల్ బాంబులు విసరమని, ఫ్లెక్సీలు పెట్టమని రెచ్చగొట్టామా, ఎన్డీబీ నుంచి తప్పుడు రిపోర్ట్ లు మేం తెప్పించామా? ఎక్కడ రెచ్చగొట్టామో చెప్పండి. ఆ దేవ దేవుడ్ని అపవిత్రం చేసే కార్యక్రమాలు తప్ప మరొకటి కాదు. తప్పుడు చేసిన వాళ్లను దేవుడు క్షమించడు. ఈ విషయంలో చంద్రబాబు వాదనతో ఏకీభవిస్తున్నాం. ఎవరు తప్పుచేసినా దేవుడు వదిలిపెట్టడు. దీనికి ఎవరూ అతీతులు కాదు. సిట్ రిపోర్టును మీరు అంగీకరించకపోతే టీటీడీ ఈవోను ఎందుకు బదిలీ చేశారు. చంద్రబాబు నియమించిన అధికారే కదా ఆయన. సిట్ రిపోర్ట్ లో లోపాలు ఉంటే చంద్రబాబు, పవన్, లోకేష్, బీజేపీ కలిసి ఓ సిట్ గా ఏర్పడితే సరిపోతుంది. టీడీపీని మేం ట్రాప్ చేయడం ఏంటి?, ఇక్కడ ఎవరూ అమాయకులు లేరు.
ఈ మీడియా సమావేశంలో వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, చెల్లుబోయిన వేణుగోపాల కృష్ణ, కారుమూరి వెంకట నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ తోట త్రిమూర్తులు, మాజీ ఎమ్మెల్యే కరణం ధర్మశ్రీ లు పాల్గొన్నారు.