జకియా ఖనమ్‌ది స్వార్థ రాజకీయం
కర్నూలు: ఏపీ శాసన మండలి డిప్యూటీ ఛైర్‌పర్సన్ జకియా ఖనమ్ తన స్వార్థ రాజకీయాల కోసమే బీజేపీలో చేరారని వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ విమర్శించారు. ఆమె బీజేపీలో చేరి ముస్లిం సమాజం తలదించుకునే పని చేశారని ఆక్షేపించారు. జకియా ఖనమ్ బీజేపీలో చేరికను హఫీజ్‌ఖాన్ తీవ్రంగా తప్పుపట్టారు. ఈ మేరకు గురువారం ఆయన ఓ వీడియో రిలీజ్ చేశారు. ఆయన ఏమన్నారంటే..` జకియా ఖనమ్ బీజేపీలో చేరడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నా, ఇప్పటి వరకు రాజకీయ పార్టీలు ముస్లింలను ఓటుబ్యాంకుగా వాడుకొని కరివేపాకులా తీసేశారు. ముస్లింలు రాజకీయంగా ఎదగాలని, వారి బలోపేతానికి పెద్ద పీట వేస్తూ వైయస్ జగన్ మోహన్ రెడ్డి చర్యలు తీసుకున్నారు. 2019 ఎన్నికల్లో ఐదుగురు ముస్లింలను ఎమ్మెల్యేలుగా శాసన సభకు పంపించారు. మరో నలుగురికి ఎమ్మెల్సీలుగా అవకాశం ఇచ్చారు. అందులోనూ ముస్లిం మహిళలను కూడా ఎమ్మెల్సీలు చేసిన ఘనత వైయస్ జగన్‌ది. జకియా ఖనమ్‌ను ఎమ్మెల్సీ చేయడమే కాకుండా, ఆమెను శాసన మండలి డిప్యూటీ చైర్‌పర్సన్‌గా నియమించి ముస్లింల పట్ల ఆయనకు ఉన్న చిత్తశుద్ధిని చూపారు. వైయస్ రాజశేఖరరెడ్డి, వైయస్ జగన్ మాత్రమే ముస్లింల పక్షాన నిలిచారు. అలాంటి వారిని కాదని ఇవాళ జకియా ఖనమ్ బీజేపీలో చేరి పెద్ద తప్పు చేశారు. ఆమె వెంట సొంత కుటుంబ సభ్యులే బీజేపీలో చేరలేదు. ఆమె పార్టీ మారినంత మాత్రాన వైయస్ఆర్‌సీపీకి వచ్చిన నష్టమేమి లేదు. ముస్లింలంతా వైయస్ఆర్‌సీపీ వెంటే ఉంటారు. ముస్లింలకు వైయస్ జగన్ తోడుగా ఉంటారు. బీజేపీ ఓటు బ్యాంకు పెంచుకునేందుకు జకియా ఖనమ్‌ను ఆ పార్టీలో చేర్చుకున్నారు. ఇక ఆమెకు రాజకీయ భవిష్యత్ ఉండదు` అని హఫిజ్‌ఖాన్ వ్యాఖ్యానించారు.