సాక్షాత్తు కూటమి ఎమ్మెల్యే కుమారుడే డ్రగ్స్ కేసులో పట్టుబడటం దారుణం
తాడేపల్లి: సాక్షాత్తు కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడే డ్రగ్స్ కేసులో పట్టుబడటం ఈ పాలన ఎంత దారుణంగా ఉందో స్పష్టమవుతోందని చూపిస్తోందని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినీ
వ్యాఖ్యానించారు. వైయస్ఆర్ కడప జిల్లా జమ్మలమడుగు బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణ రెడ్డి కుమారుడు సుధీర్ రెడ్డిని తెలంగాణ పోలీసులు అరెస్టు చేశారు. ఎమ్మెల్యే కుమారుడు సుధీర్ రెడ్డి.. హైదరాబాద్‌లో డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కాడు. దీంతో, నార్సింగి పోలీసులు.. సుధీర్ రెడ్డికి డ్రగ్స్ టెస్టు చేయడంతో పాజిటివ్‌గా తేలింది. ఈ నేపథ్యంలో సుధీర్ రెడ్డిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ ఘటనపై మాజీ మంత్రి విడదల రజినీ స్పందించారు. ఆమె మీడియాతో ప్రతినిధులతో మాట్లాడారు.
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే డ్రగ్స్‌ను అరికడతామని గొప్పగా చెప్పిన వారు, నేడు రాష్ట్రాన్ని డ్రగ్స్ గుప్పిట్లోకి నెట్టేశారని వైయస్‌ఆర్‌సీపీ నాయకురాలు, మాజీ మంత్రి విడదల రజినీ తీవ్రంగా మండిపడ్డారు. రాష్ట్రంలో డ్రగ్స్ వినియోగం 260 శాతం పెరిగిందని స్వయంగా డీజీపీనే చెప్పడం ఈ ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. డ్రగ్స్ నియంత్రణ కోసం ‘ఈగల్’ అనే వ్యవస్థను ఏర్పాటు చేశామని ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. కానీ, వాస్తవ పరిస్థితి ఏమిటంటే, నేడు సాక్షాత్తు కూటమి ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి కుమారుడే డ్రగ్స్ కేసులో పట్టుబడటం ఈ పాలన ఎంత దారుణంగా ఉందో స్పష్టంగా చూపిస్తోందని ఆమె వ్యాఖ్యానించారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల్లో డ్రగ్స్ సులభంగా లభ్యమవుతున్నాయి. దీని కారణంగా యువత పెడదారిన పడుతూ తమ భవిష్యత్తును నాశనం చేసుకుంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. డ్రగ్స్‌ను అరికట్టాల్సిన పూర్తి బాధ్యత ఈ ప్రభుత్వానిదేనని స్పష్టం చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి నారా లోకేష్ ఎక్కడున్నారో తెలియడం లేదని ఆమె ప్రశ్నించారు. రాష్ట్రం మొత్తం డ్రగ్స్ మత్తులో కూరుకుపోతున్నా ప్రభుత్వం స్పందించకపోవడం అత్యంత దురదృష్టకరమన్నారు. కూటమి నేతలే డ్రగ్స్ కేసుల్లో పట్టుబడితే ఇక రాష్ట్ర పరిస్థితి ఏంటని విడదల రజినీ ప్రశ్నించారు. వెంటనే ప్రభుత్వం మేల్కొని డ్రగ్స్ నిర్మూలనకు కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె డిమాండ్ చేశారు.