పేదలకు పథకాలు అందడం టీడీపీకి ఇష్టం లేదు
తాడేపల్లి: పేదలకు సంక్షేమ పథకాలు అందడం టీడీపీకి, చంద్రబాబుకు ఇష్టం లేదని వైయస్ఆర్‌సీపీ నేత అడపా శేషు మండిపడ్డారు. లబ్దిదారులకు డీబిటీ ద్వారా పథకాలు ఇస్తాం అంటే చంద్రబాబు అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి పథకాల నిధులు ప్రజలకు చేరకుండా అడ్డుకుంటున్నారు. ఎన్నికల కమిషన్ ఈ విషయంలో పునరాలోచన చేయాలని శేషు కోరారు.
ఓట్లకోసం కల్లబొల్లి కబుర్లు చెప్పే చంద్రబాబును పవన్ కళ్యాణ్ భుజాన వేసుకుని తిరుగుతున్నాడు. పేదలకు పథకాలు అందడం టీడీపీకి,చంద్రబాబుకు ఇష్టం లేదా అని నిలదీశారు. పథకాలు ఇళ్లకు చేరకుండా ఎన్నికల కమిషన్ పై ఒత్తిడి తెస్తున్నారు. ఉన్నత వర్గాలకు పవన్ కళ్యాణ్ చంద్ర బాబు దోచిపెట్టడానికి మళ్ళీ సిద్ధం అయ్యారని ధ్వజమెత్తారు. కాపు కార్పొరేషన్ ను చంద్రబాబు ఓ ప్రహాసనంగా మార్చారు. కాపులు ఎదగడం పవన్ కళ్యాణ్, చంద్రబాబులకు ఇష్టం లేదన్నారు. కాపుల్లో ఎదిగిన ముద్రగడ ,వంగవీటి మోహన రంగా కుటుంబాలను నాశనం చేసిన వ్యక్తి చంద్రబాబు అని ఫైర్ అయ్యారు.
నేడు చంద్రబాబు వంగవీటి రాధాను ఒక పక్క, పవన్ కళ్యాణ్ ను మరో పక్కన పెట్టుకొని కాపులను మోసం చేస్తున్నారు. ఎన్నికలప్పుడే చంద్రబాబుకు కాపులతో పాటే మిగతా కులాలు గుర్తుకు వస్తాయి. సెంట్ భూమి ఇవ్వని చంద్రబాబు ల్యాండ్ టైటలింగ్ చట్టం గురించి మాట్లాడే అర్హత లేదు. అసలు ల్యాండ్ టైటిలింగ్ చట్టం అమలు చేయమంటున్న నరేంద్రమోదికి ఈ చట్టం నల్లచట్టం అని ఎందుకు చెప్పలేకపోయారు. చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు నరేంద్రమోదికి రెండుపక్కల కూర్చున్నప్పుడు ఈ చట్టం వద్దని ఎందుకు చెప్పలేదని ప్రశ్నించారు. చంద్రబాబు,పవన్ కల్యాణ్ లు ఈ చట్టం గురించి ప్రజలను భయపెడుతున్నారు.నిజానికి ఈ చట్టం చాలా మేలైనదని నిపుణులు సైతం చెబుతున్నారు. చంద్రబాబు,పవన్ కల్యాణ ల డ్రామాలను ప్రజలు గమనిస్తున్నారు.ఎన్నికలలో వారికి బుధ్ది చెప్పేందుకు ప్రజలు సిధ్దంగా ఉన్నారని అడపా శేషు హెచ్చరించారు.