రాజధాని ముసుగులో 'ధన' యజ్ఞం
7 Apr, 2026 11:31 IST
తిరుపతి : రాజధాని అమరావతి ముసు గులో సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేశ్, ఇతర మంత్రులు ‘ధన యజ్ఞం' డ్రామాలాడుతున్నారని వైయస్ఆర్‌సీపీ వీధి నాటకం ద్వారా ప్రజలకు వివరించే ప్రయత్నం చేసింది. వైయస్ఆర్‌సీపీ తిరుపతి నియో జకవర్గ సమన్వయకర్త భూమన అభినయరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం పార్టీ శ్రేణులతో కలిసి వినూత్నంగా వీధినాటకం నిర్వహించారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రులు సంపద కోసమే... రైతుల భూములు, ప్రజల డబ్బు, ప్రజల భవిష్యత్తుని నాశనం చేస్తున్నారని నాటకం ద్వారా ప్రజలకు వివరించారు. ఈ నాటకం ద్వారా అనేక ప్రశ్నలను లేవనెత్తారు. సీఎం, డిప్యూటీ సీఎం, మంత్రుల వేషధారణలో యజ్ఞం చేస్తుంటే.. భగవంతుడు ప్రత్యక్షమై వారికి వరం ఇచ్చేలా నాటకం రూపొందించారు. ఈ నాటకానికి దర్శ కుడు సాత్విక్‌రెడ్డి, రచన రాహుల్.