విజయవాడలో వైయస్ఆర్‌సీపీ ఇఫ్తార్ విందు…
విజయవాడ: పవిత్ర రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని విజయవాడలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఇఫ్తార్ విందు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారు పాల్గొని ముస్లిం సోదరుల ఉపవాస దీక్ష విరమింపజేశారు. విజయవాడ నగరంలోని ఎస్‌ఎస్ కన్వెన్షన్ వేదికగా జరిగిన ఈ కార్యక్రమానికి ముస్లిం మత పెద్దలు, ప్రముఖులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా వైయస్ జగన్ ముస్లిం సోదరులకు ముందస్తుగా “ఈద్ ముబారక్” అంటూ ఉర్దూలో రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు.
రంజాన్ మాసం శాంతి, సోదరభావం, పరస్పర గౌరవానికి ప్రతీకగా నిలుస్తుందని ఆయన పేర్కొన్నారు. సేవా భావం, దాతృత్వం, సామరస్యం వంటి విలువలను ఈ పర్వదినం ప్రతిబింబిస్తుందని అన్నారు. సమాజంలో అన్ని వర్గాల ప్రజలు ఐక్యంగా, పరస్పర గౌరవంతో జీవించాలనే ఆకాంక్ష వ్యక్తం చేశారు. ఇఫ్తార్ విందులో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ముస్లిం సోదరులు పాల్గొని ఆధ్యాత్మిక వాతావరణంలో ఉపవాస విరమణ చేశారు.