భూమ‌న దంప‌తుల‌ పరిహార హోమం  

30 Jan, 2026 12:20 IST

తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం విషయంలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలకు సంబంధించి సీబీఐ (సిట్) నివేదిక స్పష్టత ఇచ్చిన నేపథ్యంలో, కూటమి ప్రభుత్వం చేసిన అపవాదుకు పరిహారంగా వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోమం నిర్వహించింది. ఈ కార్యక్రమంలో టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి దంపతులు పాల్గొన్నారు. భూమన నివాసంలోనే ఈ హోమం కార్యక్రమం జరిగింది.

ఈ సందర్భంగా భూమన కరుణాకర్ రెడ్డి మాట్లాడుతూ, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ శ్రీవారి లడ్డూ ప్రసాదంపై తీవ్ర అపనిందలు మోపారని ఆరోపించారు. వైయ‌స్ఆర్‌సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని రాజకీయంగా దెబ్బతీయాలనే ఉద్దేశంతో విష ప్రచారం చేశారని విమర్శించారు. హిందువుల ఆరాధ్య దైవమైన శ్రీ వెంకటేశ్వర స్వామిని రాజకీయ ఆరోపణల్లోకి లాగారని అన్నారు.

లడ్డూ ప్రసాదం తయారీలో ఆవు కొవ్వు, పంది కొవ్వు, చేప కొవ్వు కలిసిందంటూ తప్పుడు ప్రచారం చేశారని, అయితే సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఇచ్చిన నివేదికలో జంతువుల కొవ్వు ఎక్కడా కలవలేదని, రాజకీయ ప్రమేయం లేదని స్పష్టంగా పేర్కొన్నట్లు భూమన తెలిపారు.

YSRCP Homam Over Kutami Fake Allegations On Tirumala Laddu

అయినా కూడా చంద్రబాబు నాయుడు తన అనుకూల పత్రికలు, చానెళ్ల ద్వారా ఇప్పటికీ తప్పుడు ప్రచారం కొనసాగిస్తున్నారని ఆరోపించారు. కోట్లాది మంది హిందువుల మనోభావాలను దెబ్బతీశారని మండిపడ్డారు. శ్రీవారి ప్రసాదంపై వేసిన నిందలకు పరిహారంగా ‘శ్రీనివాస ప్రసాద నిందా పరిహార హోమం’ నిర్వహిస్తున్నామని, ఈ హోమం ద్వారా వేసిన అపవాదం తొలగుతుందని భావిస్తున్నామని తెలిపారు.

ఇదిలా ఉండగా, లడ్డూ అంశంపై సీబీఐ నివేదిక వెలువడినప్పటికీ టీడీపీ ఇంకా తన ప్రచారాన్ని ఆపలేదని వైఎస్సార్‌సీపీ నేతలు ఆరోపిస్తున్నారు. లడ్డూ, వెంకటేశ్వర స్వామి చిత్రాలను ఏఐ ద్వారా మార్ఫింగ్ చేస్తూ సోషల్ మీడియాలో పోస్టులు చేస్తున్నారని, పలు చోట్ల  వైయ‌స్ఆర్‌సీపీపై ద్రోహం చేశారంటూ ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తున్నారని విమర్శించారు.

టీడీపీ అధికారిక సోషల్ మీడియా ఖాతాల్లో కూడా శ్రీవారి చిత్రాలను అవహేళన చేసేలా మార్ఫింగ్ చేసిన పోస్టులు కనిపిస్తున్నాయని, ఈ చర్యలపై వెంకటేశ్వర స్వామి భక్తులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. ప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలు తప్పని తేలినా కూడా దేవుడిని అవమానించేలా వ్యవహరించడం తగదని భక్తులు మండిపడుతున్నారని సమాచారం.