రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌పై వైయ‌స్ఆర్‌సీపీ కీల‌క స‌మావేశం

23 Mar, 2026 19:02 IST

 తాడేపల్లి: వైయ‌స్ఆర్‌సీపీ కేంద్ర కార్యాలయంలో రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల ముఖ్య నేతలతో పార్టీ స్టేట్ కోఆర్డినేటర్  సజ్జల రామకృష్ణారెడ్డి కీలక సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ భవిష్యత్ కార్యాచరణపై సమగ్రంగా చర్చించారు.

రాష్ట్రంలో సాగునీటి ప్రాజెక్టుల ప్రాధాన్యతను దృష్టిలో ఉంచుకుని, ముఖ్యంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌కు సంబంధించిన అంశాలను ప్రజల్లో విస్తృతంగా తీసుకెళ్లాలని సజ్జల పిలుపునిచ్చారు. ఈ ప్రాజెక్ట్ విషయంలో జరిగిన పరిణామాలు, వాటి ప్రభావం రైతాంగంపై పడుతున్న ప్రభావం గురించి స్పష్టమైన అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందన్నారు.

 సమావేశంలో నిర్ణయించిన కార్యాచరణ 

  •  రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్‌పై జరిగిన అన్యాయాలను ప్రజల్లోకి తీసుకెళ్లడం
  •  ప్రతి జిల్లాలో టాస్క్‌ఫోర్స్‌లను ఏర్పాటు చేసి ఉద్యమాన్ని బలోపేతం చేయడం
  • వచ్చే రెండు మూడు నెలల్లో ప్రతి వారం లేదా పది రోజులకోసారి జిల్లా స్థాయి సమావేశాలు నిర్వహించడం
  •  విద్యార్థి, యువజన, రైతు విభాగాలను ఉద్యమంలో భాగస్వామ్యం చేయడం
  •  ప్రతి ఇంటికీ కరపత్రాల ద్వారా ప్రాజెక్ట్ ఆగిపోవడం వల్ల కలిగే నష్టాలను వివరించడం
  • అల్మట్టి ఎత్తు పెంపు, పోలవరం ఎత్తు తగ్గింపు వల్ల రాష్ట్రానికి, రైతులకు కలిగే నష్టాలపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించడం

ఈ అంశాలపై రాష్ట్ర స్థాయిలో సమన్వయం చేసేందుకు మాజీ మంత్రి సాకే శైలజానాథ్‌కు బాధ్యతలు అప్పగించారు.

ఈ సమావేశంలో పార్టీ నేత‌లు సాకే శైలజానాథ్, ఎస్‌వీ సతీష్ రెడ్డి, పి. రవీంద్రనాథ్ రెడ్డి, ఉషాశ్రీచరణ్, భూమన కరుణాకర్ రెడ్డి, కాకాణి గోవర్ధన్ రెడ్డి, కాటసాని రామ్‌భూపాల్ రెడ్డి, ఆకేపాటి అమర్‌నాధ్ రెడ్డి, అనంత వెంకట్రామిరెడ్డి, లేళ్ళ అప్పిరెడ్డి, మనోహర్ రెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడు జిన్నూరి రామారావు, రైతు విభాగం నేతలు వైయం ప్రసాద్ రెడ్డి, వి. భరత్ కుమార్ రెడ్డి, బూరుగుపల్లి సుబ్బారావు, కె. త్రినాథ్ రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు పుత్తా శివశంకర్, హర్షవర్ధన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.