ప్రజాస్వామ్యంలో ఓటు హక్కు పరిరక్షణ అందరి బాధ్యత 

30 May, 2026 14:30 IST

 గంగాధరనెల్లూరు: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) ప్రక్రియలో ప్రతి నిజమైన ఓటరు పేరు ఓటరు జాబితాలో కొనసాగేలా బూత్ లెవల్ ఏజెంట్లు (బీఎల్ఏలు) అప్రమత్తంగా పనిచేయాలని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు పిలుపునిచ్చారు. గంగాధరనెల్లూరు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ ఇన్‌చార్జ్ కృపలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన బీఎల్ఏల విస్తృత స్థాయి సమావేశంలో తిరుపతి–చిత్తూరు జిల్లాల వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు భూమన కరుణాకర్‌రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి నారాయణస్వామి, మాజీ ఎంపీ రెడ్డప్ప, పార్టీ రాష్ట్ర ఆర్గనైజింగ్ కార్యదర్శి వజ్ర భాస్కర్‌రెడ్డి పాల్గొన్నారు.

ఈ సందర్భంగా నాయకులు ప్రత్యేక ఓటరు జాబితా సవరణ ప్రక్రియకు సంబంధించిన పలు కీలక అంశాలపై బీఎల్ఏలకు సమగ్ర అవగాహన కల్పించారు. క్షేత్రస్థాయిలో ఎదురయ్యే పరిస్థితులు, ఓటరు ధృవీకరణ విధానం, కుటుంబ లింకేజీల పరిశీలన, డ్రాఫ్ట్ ఓటరు జాబితా పరిశీలన, క్లెయిమ్స్‌–అభ్యంతరాల దాఖలు ప్రక్రియ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. ఓటర్ల జాబితాలో అర్హులైన ప్రతి ఒక్కరి పేరు ఉండేలా చూడటంతో పాటు, ఎలాంటి పొరపాట్లు లేదా అక్రమాలు చోటుచేసుకోకుండా బీఎల్ఏలు అప్రమత్తంగా వ్యవహరించాలని సూచించారు. ఎన్నికల ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా జరిగేందుకు బీఎల్ఏల పాత్ర అత్యంత కీలకమని పేర్కొన్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థలో ఓటు హక్కు అత్యంత విలువైనదని, ప్రతి ఓటరుకు న్యాయం జరిగేలా పార్టీ శ్రేణులు సమన్వయంతో పనిచేయాలని నాయకులు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో వైయ‌స్ఆర్‌సీపీ బీఎల్ఏలు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.