ఎరువుల్లేవ్, విత్తనాల్లేవ్, గిట్టుబాటు ధరలూ లేవ్
తాడేపల్లి: కూటమి ప్రభుత్వం ఏర్పాటయ్యాక రైతులకు సబ్సిడీ ఎరువులు, విత్తనాలు కూడా దొరకని దుర్భర దుస్థితి ఏర్పడిందని, యాప్ ద్వారా ఎరువులు పంపిణీ చేయాలని ప్రభుత్వం అనాలోచిత నిర్ణయం తీసుకుందని వైయస్ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి (వ్యవసాయం, రైతు సంక్షేమం) ఎంవీయస్ నాగిరెడ్డి ఆరోపించారు. తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ భూమి యజమానిని బట్టి యాప్ ద్వారా ఎరువుల పంపిణీ చేపడితే వ్యవసాయం చేసే నిజమైన రైతులకు ఒక్క బస్తా కూడా దొరకదని ఆందోళన వ్యక్తం చేశారు. వైయస్ఆర్‌సీపీ హయాంలో ఆర్బీకే సెంటర్ల ద్వారా ఆయా గ్రామాల్లో సమయానికే సబ్సిడీ విత్తనాలు అందజేసే వాళ్లమని, కానీ నేడు సబ్సిడీ వరి, వేరుశెనగ విత్తనాలు దొరక్క రైతులు ఆందోళన చెందుతున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ధరలు పతనమై పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్టు కూడా లేదని, ప్రతి మూడు రోజులకు ధరలు పతనం అవుతున్నాయని చెప్పారు. పొగాకు సరాసరి కేజీ రూ. 196 మాత్రమే ఉందని వివరించారు. కేజీ రూ. 17 చెల్లిస్తే తప్ప మామిడి రైతులకు న్యాయం జరగని పరిస్థితి ఉందని, మామిడి రైతుల సంక్షేమం కోసం కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ. 360 కోట్లు వెచ్చించలేవా అని ప్రశ్నించారు. సీఎం చైర్మన్ గా ఉన్న అప్సడాతో సంబంధం లేకుండా రొయ్యల ఫీడ్ ధరలు పెంచడం చూస్తే ఈ ప్రభుత్వానికి రైతులపై ఉన్న చిత్తశుద్ధి ఏమిటో అర్థమవుతుందని ఎంవీఎస్ నాగిరెడ్డి చెప్పారు.
ఆయన ఇంకా ఏం మాట్లాడారంటే...
ఇలా అయితే కౌలు రైతులకు ఎరువులే దొరకవు
వ్యవసాయం అనేది ప్రాక్టికల్. థియరీ కాదు. భూమిని సాగుచేసే వాడే రైతు. భూమి కలిగిన ప్రతి ఒక్కరూ రైతు కాదు. ఓనర్‌కి, కౌలు రైతులకి అందిన ఏకైక సబ్సిడీ ఎరువుల సబ్సిడీ. భూములు సాగుచేసే వాళ్లే రసాయన ఎరువులు కొనుగోలు చేస్తారు. గతేడాది ప్రభుత్వం నిర్ణయించిన ధర రూ. 267కి పెట్టినా యూరియా దొరకలేదు. దీంతో రైతులు బ్లాక్ మార్కెట్‌లో రూ.400 నుంచి 500లకు యూరియాను కొనుగోలు చేయాల్సి వచ్చింది. ఈసారి ఎరువుల బ్లాక్ మార్కెటింగ్‌ని అరికడతామని చెప్పి ప్రభుత్వం ఒక యాప్ తీసుకొచ్చింది. రైతులకు ఉన్న పొలాలను బట్టి వారికి డీఏపీ, యూరియా ఎంత ఇవ్వాలో యాప్ నిర్ణయిస్తే దాని ప్రకారం ప్రభుత్వం పంపిణీ చేస్తుందని అధికారులు చెబుతున్నారు. వాస్తవ పరిస్థితులు చూస్తే రాష్ట్రంలో వ్యవసాయం చేస్తున్న 70 శాతం మంది కౌలు రైతులే. సొంత భూములున్న వారు ఎక్కడెక్కడో ఉద్యోగాలు, వ్యాపారాలు చేసుకుంటున్నారు. వాస్తవాలకు భిన్నంగా ప్రభుత్వం ఆలోచన చేస్తూ రైతులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్నట్టు కనిపిస్తోంది. ఇప్పటికే 2025-26 అన్ని పంటలకు చీకటి సంవత్సరం. ఏ రైతూ సంతోషంగా లేడు. కౌలు రైతులు అప్పులపాలై వ్యవసాయానికి దూరమవుతున్నారు. అలాంటిది రసాయన ఎరువులు అందించలేకపోతే రైతులు వ్యవసాయానికి దూరమైపోతారు. పొలాలు బీళ్లుగా మారే ప్రమాదం కూడా లేకపోలేదు.
కౌలు రైతులను రైతులుగానే గుర్తించడం లేదు
రాష్ట్రంలో 18 నుంచి 20 లక్షల ఎకరాల్లో సేంద్రియ సాగు జరుగుతోందని ప్రభుత్వం చెబుతోంది. కానీ లెక్కలు చూస్తే ఆ మేరకు రసాయన ఎరువుల వాడకం తగ్గినట్టు మాత్రం కనిపించడం లేదు. దీని గురించి అడిగితే అవసరాలకు మించి రసాయన ఎరువులు వాడుతున్నారని రైతులపై అభాండాలు వేస్తున్నారు. ప్రభుత్వానికి దమ్ముంటే యూరియా బదులు సేంద్రియ ఎరువులు, లేదా నానో యూరియా వాడితే ఎక్కువ లాభాలు వస్తున్నాయని నిరూపిస్తే రైతులు కూడా అదే పనిచేస్తారు. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ ఏర్పడిన 11 నెలలకే సొంత భూములన్న రైతులకు నష్టం లేకుండా కౌలు రైతులకు సర్టిఫికెట్‌లు ఇవ్వడం జరిగింది. కానీ ఇప్పటివరకు అలాంటి ప్రయత్నమే జరగడలేదు. నిజంగా వ్యవసాయం చేసే కౌలు రైతులను ఈ ప్రభుత్వం రైతులుగానే గుర్తించడం లేదు. కూటమి ప్రభుత్వం కౌలు రైతులకు అన్నదాత సుఖీభవ పథకాన్ని కూడా వర్తింపజేయడం లేదు.
సబ్సిడీ వరి, వేరుశెనగ విత్తనాలకు కరువు
రాష్ట్రంలో ఎక్కువ సాగు జరుగుతున్న పంట వరి. ఎకరానికి 20 కేజీల వరి విత్తనాలు కావాలి. రైతులకు ఒక్క టన్ను కూడా సబ్సిడీ వరి విత్తనాలు పంపిణీ చేసింది లేదు. వేరుశెనగ పంటకు ఎకరాకు 80 నుంచి 100 కేజీలు విత్తనాలు కావాలి. రైతుకు కేవలం విత్తనాలకే ఎకరాకు రూ. 10వేలు ఖర్చు చేయాల్సి ఉంటుంది. గత వైయస్ఆర్‌సీపీహయాంలో ఆయా గ్రామాల్లో రైతు భరోసా కేంద్రాల ద్వారా నేరుగా వేరుశెనగ విత్తనాలు అందిండం జరిగింది. కానీ కూటమి ప్రభుత్వంలో గతేడాది వేరుశెనగ విత్తనాలు పంపిణీ చేసిన వారికే ఇప్పటికీ డబ్బులివ్వకపోవడంతో వారు ముందుకు రావడం లేదని ఎల్లో మీడియానే రాస్తోంది. ఎరువులు విత్తనాలు ఇవ్వకపోతే రైతులు ఎలా వ్యవసాయం చేస్తారు? సబ్సిడీ విత్తనాలు కూడా పంపిణీ చేయలేని దుస్థితికి ప్రభుత్వం వెళ్లిందంటే వ్యవసాయం రంగం ఎంత అధోగతిపాలైందో అర్థం చేసుకోవచ్చు.
తీవ్ర సంక్షోభంలో పొగాకు రైతు
రాష్ట్రంలో అత్యంత సక్షోభంలో పొగాకు పంట అమ్మకం జరుగుతోంది.వైయస్ఆర్‌సీపీ హయాంలో చివరి ఏడాది 2023-24లో 215.35 మిలిమన్ కేజీల పొగాకు అమ్మకాలు జరిగితే దాని సరాసరి ధర రూ. 288.65లు. 2024-25లో గతేడాది కూటమి ప్రభుత్వ హయాంలో చూస్తే
240.64 మిలియన్ కేజీలకు పొగాకు ఉత్పత్తి పెరిగితే అమ్మకం ధర మాత్రం రూ. 248.86లకు పడిపోయింది. అంటే కేజీ మీద దాదాపు రూ. 40లు పడిపోయింది. ఈఏడాది 278 మిలియన్ కేజీల పొగాకు ఉత్పత్తి జరుగుతుందని ప్రభుత్వ లెక్కలు చెబుతున్నాయి. కానీ ఇప్పటి వరకు ధరలు చూస్తే ప్రతి మూడు రోజులకు ఒకసారి పడిపోతూ ఇప్పుడు రూ. 228లకు చేరుకుంది. దక్షిణాది నల్ల నేలల్లో నిన్న సరాసరి ధర రూ. 196.36లకు చేరింది. గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో మార్క్‌ఫెడ్‌ను ఎంటర్ చేసి ధరలు పడిపోకుండా ప్రభుత్వమే కొనుగోలు చేసి రైతులను ఆదుకొంది. ఇంతదారుణంగా ధరలు పతనం అవుతున్నా ప్రభుత్వం తీసుకున్న చర్యలేవి? రూ. 300 కోట్లు వెచ్చించి ఆ పొగాకును ప్రభుత్వం కొనుగోలు చేయలేకపోతోందా?
కేజీ రూ. 17లు చెల్లిస్తేనే మామిడి రైతుకి గిట్టుబాటు
గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వ హయాంలో 2023-24 సీజన్‌లో తోతాపురి మామిడి ధర కేజీ రూ. 20 నుంచి రూ.22ల వరకు పలికింది. కూటమి ప్రభుత్వం వచ్చాక కేంద్రం కనీస ధర రూ. 14.90 నిర్ణయించినా గతేడాది రూ. 8లకు కూడా జ్యూస్ ఫ్యాక్టరీలు కొనుగోలు చేయలేదని రైతులే చెప్పారు. రూ. 4.99ల నుంచి రూ.6 లకు కొనుగోలు చేశారని చెప్పారు. ప్రస్తుత పరిస్ధితి చూస్తే ర్యాంపుల్లో రూ. 4.50 నుంచి రూ. 5లకు కొనుగోలు చేస్తున్నారని, జ్యూస్ ఫ్యాక్టరీలు రూ.6 నుంచి రూ.6.50లకు మించి కొనుగోలు చేయడం లేదని రైతులు చెబుతున్నారు. ఇలాంటి వాస్తవాలు చెబుతుంటే క్రిమినల్ కేసులు పెడతామని వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు బెదిరిస్తున్నాడు. ప్రభుత్వ అనుకూల మీడియాలో సైతం రైతుల సమస్యల మీద వార్తలొస్తున్నా ప్రభుత్వం నిద్రమత్తు వీడటం లేదు. కేంద్ర ప్రభుత్వం నుంచి పీడీపీఎస్ స్కీమ్ ద్వారా రాయితీలు కల్పించే ఆలోచన చేయడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం ధర ప్రకటించలేదు. కంపెనీలు ధర నిర్ణయించలేదు. డీజిల్ ధరలు పెరిగిన నేపథ్యంలో ఉత్పత్తి వ్యయం పెరిగింది. కనీసం రూ. 17లు ఉంటే కానీ గిట్టుబాటు కాదని రైతులు చెబుతున్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి రూ. 360 కోట్లు ఇవ్వలేని పరిస్ధితుల్లో ఉన్నాయా? జ‌్యూస్ ఫ్యాక్టరీలకు అనుకూలంగా ప్రభుత్వాలు నడుస్తున్నాయా, రైతుల కోసం ప్రభుత్వం పనిచేస్తోందా? తోతాపురి మామిడి రైతుల సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఏం చర్యలు తీసుకుందో చెప్పాలి.
అప్సడాతో సంబంధం లేకుండా ఫీడ్ ధరలు పెంచడం ఏంటి?
అప్సడాతో సంబంధం లేకుండా ఫీడ్ కంపెనీలు ధరలు పెంచుకుంటున్నాయని ఆక్వా రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యమంత్రి అప్సడా చైర్మన్ గా ఉండి కూడా ఎక్కడా ఆయన రోల్ కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం వచ్చాక రెండేళ్లలో 500 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారు. ఆర్టీఐ ద్వారా ప్రభుత్వాన్ని అడిగితే 112 మంది ఆత్మహత్య చేసుకున్నారని, వారికి పరిహారం ఇవ్వడానికి సీఎఫ్ఎంసీలో ఫైల్ పెట్టామని చెప్పారు. కానీ ఆత్మహత్యలు చేసుకున్న ఒక్క రైతుకి కూడా ప్రభుత్వం వచ్చిన రెండేళ్లలో కనీసం ఒక్క రూపాయి కూడా పరిహారం చెల్లించిన పాపానపోలేదు. వ్యవసాయ రంగం, రైతు కుటుంబాల పట్ల ఈ ప్రభుత్వ వైఖరికి ఈ విధానాలే అద్దం పడుతున్నాయి.