ప్రతిపక్ష హోదా ఇవ్వటానికి ప్రభుత్వం భయపడుతోంది
తాడేపల్లి : వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ప్రతిపక్ష హోదా ఇవ్వడానికి ప్రభుత్వం భయపడుతుందని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి పేర్కొన్నారు. గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. రాష్ట్రంలో క్యాష్, లోకేష్, సూట్ కేసులు వంటి వివాదాస్పద వ్యవహారాలు కొనసాగుతున్నాయి. ఈ పరిస్థితులపై మండలిలో గట్టిగా నిలదీసి, అన్యాయపు పోకడలను ప్రశ్నించనున్నట్లు తెలిపారు. మాజీ మంత్రి అంబటి రాంబాబును అన్యాయంగా అరెస్ట్ చేసిన సంఘటనలు, తమ నేతలపై పెట్టిన అక్రమ కేసులు కూడా చర్చకు వస్తాయని ఆయన తెలిపారు. తిరుమల లడ్డూ విషయంలో కూడా చంద్రబాబు హిందూ భక్తుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని మండిపడ్డారు. నాణ్యత లేని నెయ్యి టాంకర్లు తమ హయాంలో వెనక్కు పంపినట్లు, అన్ని రికార్డులు ఉన్నట్లు పేర్కొన్నారు. చీటింగ్ విషయాన్ని సీబీఐ కూడా గుర్తించినట్లు గుర్తు చేశారు. వేల కోట్ల విలువైన భూములను ప్రభుత్వం తమవారికి కట్టబెట్టడం, గీతం యూనివర్శిటీకి ఐదు వేల కోట్ల విలువైన భూములను అక్రమంగా కట్టబెట్టిన సంఘటనలను మండలిలో చర్చిస్తామని చెప్పారు. వీటన్నిటిపై ప్రజలకు నిజాన్ని వెల్లడిస్తూ, ప్రభుత్వ అక్రమాలకు తగిన ప్రతిస్పందన ఇవ్వాల్సిన అవసరం ఉందని అప్పిరెడ్డి పేర్కొన్నారు.