కుటుంబ పెద్దలా సీఎం వైయస్ జగన్ కష్టపడుతున్నారు
గుంటూరు: మనకు నాయకుడు ఒక్కడే.. మన నాయకుడి నినాదం కూడా ఒక్కటేనని, అదే సంక్షేమం అని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని సీఎం వైయస్ జగన్ నెరవేర్చారన్నారు. కుటుంబ పెద్దలా రోజుకు 16 గంటలు కష్టపడుతున్నారన్నారు. ఏపీని దేశంలో నంబర్ వన్ స్థానంలో నిలపడమే సీఎం వైయస్ జగన్ లక్ష్యమన్నారు. గుంటూరులోని వెంకటేశ్వర విజ్ఞాన మందిరంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలను ఉద్దేశించి సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడారు.
‘పదేళ్లు ఎన్నో కష్టాలు పడి అధికారంలోకి వచ్చాం. మేనిఫెస్టోలో చెప్పిన ప్రతీ హామీని నెరవేర్చిన వ్యక్తి సీఎం వైయస్ జగన్. మన నాయకుడు చేసిన మంచిని చెప్పుకుని సగర్వంగా ప్రజల్లోకి వెళుతున్నాం. నిత్యవిద్యార్థిలా ముఖ్యమంత్రి వైయస్ జగన్∙మోహన్ రెడ్డి పనిచేస్తున్నారు. ఎన్ని కష్టాలొచ్చినా పట్టుదలతో పనిచేస్తున్నారు. కుటుంబ పెద్దలా రోజుకు 16 గంటలు పనిచేస్తున్నారు. ఏపీని దేశంలోనే నంబర్–1గా నిలపడమే మన నాయకుడు వైయస్ జగన్ లక్ష్యం..మన లక్ష్యం. వైయస్ జగన్మోహన్ రెడ్డిని తప్పించాలని జరుగుతున్న కుట్రను భగ్నం చేయాలి. పార్టీ శ్రేణులు ప్రజల్లోకి వెళ్లాలి. ఎన్నికల వేడి మొదలైపోయింది. జగన్మోహన్రెడ్డినే ఎందుకు గెలిపించుకోవాలో ప్రజలకు వివరించాలి. సీఎం వైయస్ జగన్ తలపెట్టిన యజ్ఞం కొనలాగేలా అంతా అండగా ఉండాలి. మనమేం చేశామో జనానికి చెప్పాలి.
2014లో ప్రజలు పట్టం కడితే చంద్రబాబు రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టాడు. మనం ఏం చేశామో చెప్పుకోగలం. చెప్పుకోవడానికి చంద్రబాబు దగ్గర ఏమీ లేదు. ఓ నటుడిని అడ్డం పెట్టుకుని చంద్రబాబు రాజకీయం చేస్తున్నాడు. చంద్రబాబు వద్ద పవన్ తన అభిమానాన్ని తాకట్టు పెట్టాడు. సీఎం జగన్మోహన్రెడ్డిని నోటికొచ్చిన బూతులు తిడుతున్నారు. మేం ఎదురుతిరిగితే మీరు తట్టుకోగలరా..?, మూడు రాజధానులు ప్రకటించిన తర్వాతే అమరావతి ప్రాంతంలో మనం అన్ని ఎన్నికల్లోనూ గెలిచాం. మూడు ప్రాంతాల ప్రజలు అభివృద్ధి చెందాలి. మూడు రాజధానుల వల్లే రాష్ట్రమంతా అభివృద్ధి చెందుతుంది. వికేంద్రీకరణపై ప్రతిపక్షాలు చేస్తున్న ప్రయత్నాలతో ఎవరూ రెచ్చిపోవద్దు. బండబూతులు తిడుతున్న వారికి బుద్ధి చెప్పాలి...ప్రజలకు మనం చేస్తున్న సంక్షేమం చెప్పాలి’ అని పార్టీ శ్రేణులకు, ప్రజలకు సజ్జల రామకృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.