రామసుబ్బారెడ్డికి పార్టీలో సముచిత స్థానం
తాడేపల్లి: మాజీ మంత్రి, సుదీర్ఘ రాజకీయ అనుభవం కలిగిన రామసుబ్బారెడ్డికి పార్టీలో సముచిత గౌరవం ఉంటుందని వైయస్‌ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్‌తో రామసుబ్బారెడ్డి భేటీ అయ్యారు. అనంతరం మీడియా పాయింట్ వద్ద పార్టీ ప్రధాన కార్యదర్శి సజ్జల, రామసుబ్బారెడ్డి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతూ..
‘ఏడాది క్రితమే మాజీ మంత్రి రామసుబ్బారెడ్డి మా పార్టీలోకి వచ్చారు. కోవిడ్ తీవ్రతరం కావడంతో క్షేత్రస్థాయిలో కలిసి పనిచేయడం ఆలస్యమైంది. పార్టీలో రామసుబ్బారెడ్డికి సముచిత గౌరవం ఉంటుందని సీఎం హామీ ఇచ్చారు. జమ్మలమడుగు నుంచి 2014 ఎన్నికల్లో వైయస్‌ఆర్ సీపీ తరఫున గెలిచిన వ్యక్తి పార్టీ ఫిరాయించినప్పుడు డాక్టర్ సుధీర్‌రెడ్డి కష్టకాలంలో నియోజకవర్గంలో పార్టీ బాధ్యతలు స్వీకరించి నిలబడి పోరాడారు. ఎమ్మెల్యేగా మంచి మెజార్టీతో గెలిచారు.
ఎలాంటి కల్మషం లేకుండా రాజకీయాలు చేసే నాయకుడు సీఎం వైయస్ జగన్. రానున్న ఎన్నికల్లో కూడా జమ్మలమడుగు నుంచి డాక్టర్ సుధీర్‌రెడ్డి మళ్లీ ఎమ్మెల్యేగా పోటీ చేస్తారు. రామసుబ్బారెడ్డి కూడా సొంత తమ్ముడిలా సుధీర్‌రెడ్డితో కలిసి పనిచేస్తారు. 2023లో వచ్చే శాసనమండలికి రామసుబ్బారెడ్డి అనుభవాన్ని వాడుకుంటాం. నియోజకవర్గ విభజన జరిగితే ఇద్దరికీ చెరో స్థానం ఇస్తాం. జిల్లా రాజకీయాల్లో రామసుబ్బారెడ్డి కీలకంగా ఉంటారు. ఎమ్మెల్యే సుధీర్‌రెడ్డితో కలిసి పనిచేస్తారు’ అని సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు.