సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తున్నాం
తాడేపల్లి: పంచాయతీ ఎన్నికల విషయంలో సుప్రీం కోర్టు తీర్పును గౌరవిస్తున్నామని వైయస్ఆర్‌సీపీ ప్రధాన కార్యదర్శి, ప్రభుత్వ సలహాదారు సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. రాజకీయ పార్టీగా ఎన్నికలను స్వాగతిస్తున్నామని ఆయన పేర్కొన్నారు. ప్రజల ఆరోగ్యం పట్ల తపనతోనే ఎన్నికలు వాయిదా వేయాలని కోరామన్నారు. సమస్య లేనప్పుడు ఎన్నికలు వాయిదా వేసి..సమస్య ఉన్నప్పుడు ఎన్నికలు అంటున్నారని పేర్కొన్నారు. ఇదే విషయాన్ని కోర్టు ముందు ఉంచామని తెలిపారు. సోమవారం సాయంత్రం తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో సజ్జల రామకృష్ణారెడ్డి మీడియాతో మాట్లాడారు. ప్రజారోగ్యం బాగుండాలన్న తాపత్రయంతోనే ఎన్నికలు వాయిదా వేయాలని ఎన్నికల కమిషన్‌ను కోరామన్నారు.పరిషత్ ఎన్నికలను పక్కన పెట్టి పంచాయతీ ఎన్నికలు ముందుకు తెచ్చారు. పంచాయతీ ఎన్నికలు ముందుకు తీసుకురావడంలోనే కుట్ర ఉందని అర్థమవుతుందన్నారు.ఎన్నికల నిర్వహణలో కుయుక్తులు ఉన్నాయని భావిస్తున్నామన్నారు.వ్యాక్సినేషన్, ఎలక్షన్ ఒక్కసారి జరగలేవని కోర్టుకు చెప్పామన్నారు. కరోనా నేపథ్యంలో ఉద్యోగులు ఆందోళనగా ఉన్నారని చెప్పారు. వ్యాక్సినేషన్ వేసుకోకుండానే ఉద్యోగులు ఎన్నికలకు వెళ్లాల్సి ఉందన్నారు. మా అభ్యంతరాలను ఎప్పటికప్పుడు ఎస్ఈసీ ముందు పెట్టామని తెలిపారు.ఎస్ఈసీ వినకపోవడంతో కోర్టును ఆశ్రయించామని పేర్కొన్నారు.
వైయస్ఆర్‌సీపీకి ఎన్నికలు కొత్త కాదు
ఎన్నికల్లో పోటీ చేయడం..ఎన్నికల్లో గెలవడం వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి కొత్త కాదని సజ్జల రామకృష్ణారెడ్డి పేర్కొన్నారు. మధ్యలో ఆగిన ఎంపీటీసీ, జెడ్పీటీసీ ఎన్నికలను పక్కన పెట్టి పంచాయతీ ఎన్నికలు ముందుకు తెచ్చారని అనుమానం వ్యక్తం చేశారు. ఎన్నికల నిర్వహణలో కుయుక్తులు ఉన్నాయని భావిస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగ సంఘాల ఆవేదనను ఎస్ఈసీ అర్థం చేసుకోలేదన్నారు. ప్రాణాలకు తెగించి విధులు నిర్వహించాలన్న విషయాన్ని గమనించలేదన్నారు. ఈ సమస్య రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఉంటుందన్నారు. ఏం చేయాలన్న దానిపై కేంద్రంతో చర్చించి నిర్ణయం తీసుకుంటామన్నారు. సమస్య లేనప్పుడు ఎన్నికలు వాయిదా వేసి..సమస్య ఉన్నప్పుడు ఎన్నికలు అంటున్నారని, రేపు ఏదైనా జరిగితే ఎస్ఈసీదే పూర్తి బాధ్యత అన్నారు. ప్రభుత్వంతో ఎన్నికల విషయంలో చర్చించాలన్న ఆలోచన ఇప్పటికీ ఎస్ఈసీకి లేదని తప్పుపట్టారు. ఎస్ఈసీ కేంద్రానికి ఎందుకు లేఖ రాశారో ఆయనకే తెలియాలన్నారు. గ్రామాల్లో విద్వేషాలు రాకూడదనే ఉద్దేశంతో ఏకగ్రీవాలను ప్రభుత్వం ప్రోత్సహిస్తుందని, గొడవలు సృష్టించాలని ఏకగ్రీవాలు కాకుండా అడ్డుకుంటే..ఆ బాధ్యత కూడా ఎస్ఈసీదేనని స్పష్టం చేశారు. సుప్రీం కోర్టు తీర్పు ప్రజా విజయమని టీడీపీ సంబరాలు చేసుకోవడం వారి అవివేకమన్నారు. మాకు ప్రజల ప్రాణాలు, ఉద్యోగుల భద్రతే ముఖ్యం కాబట్టి కోర్టుకు వెళ్లామని మరోసారి సజ్జల రామకృష్ణారెడ్డి స్పష్టం చేశారు.