స్వచ్ఛంద నమోదు బీమా పేరుతో ద‌గా 

20 Jan, 2026 19:16 IST

అమ‌లాపురం: దేశంలో ఎక్కడా లేని విధంగా ఏపీ రైతులను పంటల బీమా పరిధిలోకి రాకుండా చంద్రబాబు ప్రభు­త్వం దగా చేసిందని వైయస్‌ఆర్‌సీపీ రైతు విభాగం అధ్య‌క్షుడు రామారావు (బాబి) ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. అమలాపురంలోని ఓ ఫంక్ష‌న్ హాల్ లో నిర్వ‌హించిన కార్యక్ర‌మంలో ఆయ‌న వైయస్‌ఆర్‌సీపీ నాయ‌కుల‌తో క‌లసి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్ర‌భుత్వ నిర్వాకాల ఫలితంగా.. రుణాలు పొందని రైతులే కాదు, రుణాలు తీసుకునేవారు కూడా పంటలకు ప్రీమియం చెల్లించేందుకు అవకాశం లేకుండా పోయిందని ఆక్షేపించారు. కూట‌మి ప్రభుత్వం ప్రీమియం బకాయిలు చెల్లించని కారణంగా ప్రస్తుతం రబీ సీజన్‌లో కనీసం బిడ్డింగ్‌లో పాల్గొనేందుకు కూడా ఇన్సూరెన్స్‌ కంపెనీలు ముందుకు రాలేదని చెప్పారు. జాతీయ స్థాయిలో ఫసల్‌ బీమా పరిధిలోకి వచ్చే రాష్ట్రాల జాబితా నుంచి ఏపీని తొలగించారన్నారు. అధికారంలోకి రాగానే ఉచిత పంటల బీమాను ఎగరగొట్టిన చంద్రబాబు ప్ర‌భుత్వం.. ఏడాది తిరగకుండానే ’స్వచ్ఛంద పంటల బీమా’ పథకాన్ని సైతం నిర్వీర్యం చేసింద‌ని మండిప‌డ్డారు. చంద్ర‌బాబు చ‌ర్య‌ల కార‌ణంగా 2023-24, 2024-25 సీజన్లకు సంబంధించి కనీసం రూ.3,500 కోట్లకుపైగా బీమా పరిహారం అన్నదాతకు అంద‌కుండా పోయింద‌ని వివ‌రించారు. దీంతోపాటు కరువు బకాయిలతో క‌లిపి 19 నెలల్లో రూ.1,100 కోట్లకు పైగా ఇన్‌పుట్‌ సబ్సిడీ ఎగనామం పెట్టిందని చెప్పారు. 

వైయస్‌ఆర్‌సీపీ ప్రభుత్వ హ‌యాంలో ఉచితంగా పంట‌ల బీమా
గ‌త వైయస్‌ఆర్‌సీపీ ప్ర‌భుత్వ హ‌యాంలో 2019-24 మధ్య రైతులపై పైసా భారం పడకుండా ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేయడమే కాకుండా ఏ సీజన్‌కు చెందిన బీమా పరిహారాన్ని మరుసటి ఏడాది అదే సీజన్‌ ముగిసేలోగా జమచేసిన‌ట్టు చెప్పారు. ఈ - క్రాప్‌ ప్రామాణికంగా ఏటా సగటున 1.08 కోట్ల ఎకరాల చొప్పున ఐదేళ్లలో 5.42 కోట్ల ఎకరాలకు.. ఏటా సగటున 50 లక్షల మంది చొప్పున ఐదేళ్లలో రెండున్నర కోట్ల మంది రైతులకు బీమా రక్షణ దక్కిందని వెల్ల‌డించారు. ప్రభుత్వ వాటాతో పాటు రైతుల తరపున రూ.3,022.26 కోట్లను ప్రీమియం రూపంలో కంపెనీలకు వైఎస్‌ జగన్‌ ప్రభుత్వం చెల్లించిన‌ట్టు చెప్పారు. 2014-19 మధ్య చంద్రబాబు హయాంలో 30.85 లక్షల మంది రైతుల‌కు కేవలం రూ.3,411.20 కోట్ల మేర బీమా పరిహారం మాత్రమే అందిస్తే.. 2019-24 మధ్య వైయస్‌ఆర్‌సీపీ హ‌యాంలో 54.55 లక్షల మంది రైతులకు ఏకంగా రూ.7,802.08 కోట్ల మేర పరిహారాన్ని అందజేసి ఆదుకుంద‌ని వివ‌రించారు. 

కూట‌మి ప్ర‌భుత్వం తీసుకొచ్చిన స్వచ్ఛంద నమోదు బీమా కార‌ణంగా ప్రీమియం భారం భరించలేక 80 శాతానికి పైగా రైతన్నలు పంటల బీమాకు దూరమైపోయారని అన్నారు. 2025 ఖరీఫ్‌ సీజన్‌లో దాదాపు 72.90 లక్షల ఎకరాల్లో పంటలు సాగవగా 19.58 లక్షల ఎకరాలకే బీమా కవరేజ్‌ లభించిందని, దాదాపు 50 లక్షల మంది రైతులు పంటలు సాగు చేయగా కేవలం 19.40 లక్షల మంది మాత్రమే పంటలకు బీమా ప్రీమియం చెల్లించగలిగారని రామారావు వివ‌రించారు.