అధికార జులుంతో ఉద్యోగుల ప్రాణాలు తీస్తారా?
తాడేపల్లి: అధికార జులుం ప్రదర్శించి ఉద్యోగుల ప్రాణాలు తీసే పరిస్థితికి రాష్ట్రాన్ని నెట్టినందుకు కూటమి ప్రభుత్వమే పూర్తిగా బాధ్యత వహించాలని వైయస్ఆర్‌సీపీ ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ వింగ్ అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు. విశాఖలోని గాజువాక జోన్‌లో స్వచ్ఛాంద్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి నిర్వహించిన సమీక్షా సమావేశంలో విశాఖ మహానగర పాలక సంస్థ (జీవీఎంసీ) మెకానికల్ సెక్షన్ సూపరింటెండెంట్ ఇంజనీర్ (ఎస్‌ఈ) గోవిందరావు తీవ్ర ఒత్తిడికి లోనై, అక్కడికక్కడే కుప్పకూలారని, అందుకు ఆ పట్ఠాభిదే పూర్తి బాధ్యత అని ఆయన తేల్చి చెప్పారు. ఇది ప్రభుత్వ నిర్లక్ష్యానికి, అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని ఫైర్ అయ్యారు. సమీక్షా సమావేశంలో ఉన్నతాధికారిపై స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి, ఆ స్థాయిలో జులుం ప్రదర్శించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు.
జీవీఎంసీలో చెత్త సేకరణ కాంట్రాక్ట్ తమ జేబు సంస్థకు అప్పగించేందుకే పట్టాభి, ఆ స్థాయిలో విరుచుకుపడ్డారని, అందుకే ఎస్‌ఈ మరణానికి బాధ్యుడిని చేస్తూ, ఆయనపై వెంటనే హత్య కేసు నమోదు చేయడమే కాకుండా, స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పదవి నుంచి తొలగించాలని పార్టీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు.
ప్రెస్‌మీట్‌లో ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి ఇంకా ఏం మాట్లాడారంటే..:
ముమ్మాటికీ పట్టాభిదే బాధ్యత:
గాజువాక ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావుతో కలిసి అక్కడి జోనల్ కార్యాలయంలో సమీక్ష నిర్వహించిన స్వచ్ఛాంధ్ర కార్పొరేషన్ ఛైర్మన్ పట్టాభి, జీవీఎంసీ మెకానికల్ సెక్షన్ సూపరింటెండెంట్ ఇంజినీర్ గోవిందరావుపై రెచ్చిపోయి, వరుస ప్రశ్నలతో గదమాయిస్తూ తీవ్రంగా అవమానించారు. డంపింగ్ యార్డ్‌లో చెత్త నిల్వల తరలింపునకు పాత కాంట్రాక్టర్‌ను తొలగించి కొత్త కాంట్రాక్టర్‌కు బాధ్యతలు అప్పగించినట్లు ఎస్‌ఈ వివరణ ఇస్తున్నా వినిపించుకోకుండా.. ‘ఏం తమాషా చేస్తున్నావా’ అంటూ విరుచుకుపడ్డారు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన గోవిందరావు అక్కడికక్కడే కుప్పకూలిపోయారు. అందుకే ఎస్‌ఈ మృతికి ముమ్మాటికి పట్టాభిదే బాధ్యత.
ఒక ఉన్నతాధికారికే ఏ రక్షణ లేకపోతే, చిన్న ఉద్యోగుల పరిస్థితి ఎంత దయనీయంగా ఉంటుందనేది అందరూ ఆలోచించాలి. ఇటీవల ఒక తహశీల్దార్ మృతి, ఇంకా సచివాలయాల ఉద్యోగులు పలువురి ఆత్మహత్యలకు అధికార పార్టీ వేధింపులే కారణం. ఒక ఎస్‌ఈ ప్రాణాలు బలిగొన్న పట్టాభిపై వెంటనే హత్య కేసు నమోదు చేయడమే కాకుండా, ఆయన్ను కార్పొరేషన్ చైర్మన్ పదవి నుంచి తొలగించాలి.
ఆనాడే చర్యలు తీసుకుని ఉంటే..:
శ్రీశైలం టీడీపీ ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి అటవీ అధికారులపై దాడి చేసినా చర్యలు తీసుకోకపోవడం వల్లే రాష్ట్రంలో అధికారులపై దాడులు పెరిగాయి. రాష్ట్రవ్యాప్తంగా చెత్త సేకరణ కాంట్రాక్టులను జేబు సంస్థలకు అప్పగించేందుకు అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. అందులో భాగంగానే గోవిందరావును బలి తీసుకున్నారు. ఎస్‌ఈ గోవిందరావు మృతిపై న్యాయవిచారణ జరిపించాలి. ఉద్యోగుల ప్రాణాలతో ఇలా చెలగాటం ఆడితే, వైయస్ఆర్‌సీపీ ఊర్కోబోదని, వారి తరపున నిలబడి గట్టిగా పోరాడుతుందని ఎన్.చంద్రశేఖర్‌రెడ్డి స్పష్టం చేశారు.