పార్టీ కార్యక్రమాల్లో ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించడం దారుణం
తాడేపల్లి: వైయస్ఆర్ కడప జిల్లాలో తెలుగుదేశం పార్టీ నిర్వహిస్తున్న మహానాడులో ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించడం దారుణమని వైయస్ఆర్‌సీపీ ఎంప్లాయిస్, పెన్షనర్స్ వింగ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ చంద్రశేఖర్ రెడ్డి మండిపడ్డారు. ప్రభుత్వ తీరుపై ఆయన అభ్యంతరం వ్యక్తం చేస్తూ ఓ వీడియో సందేశం పంపించారు.
చంద్రశేఖర్‌రెడ్డి ఏమన్నారంటే..
రాయలసీమ జిల్లాల నుంచి ప్రధానంగా వైయస్ఆర్ జిల్లా నుంచి గరిష్టంగా ఉద్యోగులను మహానాడు పనులకు వినియోగించడాన్ని తప్పు పట్టారు. దాదాపు వారం రోజుల నుంచి చేపడుతున్న మహానాడు పనుల్లో రెవెన్యూ, వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగులను.... తెలగుదేశంపార్టీ కార్యక్రమాలకు వినియోగించడాన్ని ఖండించారు.
వైయస్సార్ జిల్లాకు చెందిన ఇద్దరు వీఆర్వోలు టీడీపీ మహానాడు ప్రాంగణంలో కటౌట్లు కూలి తీవ్ర గాయాలపాలైన ఘటనపైనా ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వారికి ప్రాణాపాయం జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రభుత్వాన్ని నిలదీశారు. పార్టీ సమావేశాల్లో ప్రభుత్వ యంత్రాంగాన్ని వినియోగించడం సరైన విధానం కాదన్నారు.