అవుట్ సోర్సింగ్ ఉద్యోగాలన్నీ అనుయాయులకు కట్టబెట్టేందుకు కుట్ర
తాడేపల్లి: రాష్ట్రంలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగాలన్నింటినీ అధికార పార్టీ అనుయాయులకు కట్టబెట్టేందుకు కుట్ర జరుగుతోందని వైయస్ఆర్‌సీపీ ఎంప్లాయిస్ అండ్ పెన్షనర్స్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు నలమారు చంద్రశేఖర్‌రెడ్డి ఆరోపించారు. తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ, ప్రభుత్వం తీసుకొచ్చిన జీవో నం.12 ద్వారా మళ్లీ దళారీ వ్యవస్థను ప్రోత్సహించే ప్రయత్నం జరుగుతోందని మండిపడ్డారు. గతంలో అవుట్‌సోర్సింగ్ ఉద్యోగుల శ్రమ దోపిడీని అరికట్టేందుకు శ్రీ వైయస్ జగన్ మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం ఆప్కాస్ వ్యవస్థను తీసుకొచ్చిందని, దీని ద్వారా లక్ష మందికి పైగా చిరుద్యోగులకు రక్షణ లభించిందని తెలిపారు.
ప్రెస్‌మీట్‌లో నలమారు చంద్రశేఖర్‌రెడ్డి ఇంకా ఏమన్నారంటే..:
ఆప్కాస్ వ్యవస్థను బలహీనపరిచే కుట్ర
ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆప్కాస్ వ్యవస్థను బలహీనపరుస్తూ మళ్లీ అవుట్ సోర్సింగ్ ఏజెన్సీలకు ఉద్యోగ నియామకాలను అప్పగించే ప్రయత్నం చేస్తోంది. ఇటీవల సమగ్ర శిక్ష విభాగంలో ప్రకటించిన పోస్టులను ఆప్కాస్ ద్వారా భర్తీ చేయాల్సిన పరిస్థితిలో వాటిలో సగభాగాన్ని ప్రైవేట్ అవుట్‌సోర్సింగ్ సంస్థలకు అప్పగించే చర్యలు తీసుకుంటున్నారు. సంక్షేమ శాఖలోని పలు విభాగాల్లో కూడా ఇదే విధానాన్ని అమలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేస్తోంది. ఈ విధానంతో ఉద్యోగులకు ఏడాదిలో 12 నెలల బదులుగా 10.5 నెలలకే వేతనాలు చెల్లించే పరిస్థితి తీసుకొస్తున్నారు.
కమీషన్ల కోసమే తెరపైకి దళారీ వ్యవస్థ
అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులు ప్రభుత్వానికి కీలకంగా సేవలందిస్తున్నప్పటికీ, వారి భద్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టడం లేదు. కమీషన్ల కోసం దళారీ వ్యవస్థను మళ్లీ తీసుకొస్తే ఉద్యోగుల్లో తిరుగుబాటు మొదలవుతుంది. ఇప్పటికే కొన్ని ప్రైవేట్ సంస్థలు ఉద్యోగులకు నెలల తరబడి వేతనాలు చెల్లించకపోవడం ఆందోళనకరం. ప్రభుత్వం వెంటనే జీవో నం.12ను పునరాలోచించి, ఆప్కాస్ వ్యవస్థను కొనసాగిస్తూ ఉద్యోగ నియామకాలు ప్రభుత్వ ద్వారానే చేపట్టాలి.
చిరుద్యోగులకు రక్షణగా ‘ఆప్కాస్’
గత వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో కాంట్రాక్ట్, అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రెగ్యులర్ ఉద్యోగులతో పాటు సమయానికి జీతాలు చెల్లించేవారు. దళారి వ్యవస్థను పూర్తిగా తొలగించి, దాదాపు లక్ష మంది అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులకు రక్షణగా ‘ఆప్కాస్’ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఆప్కాస్‌ను బలహీనపరిచి, మళ్లీ ప్రైవేట్ ఏజెన్సీలకు ఉద్యోగాలను అప్పగించే ప్రయత్నం చేస్తోంది. సమగ్ర శిక్షలో నోటిఫై చేసిన పోస్టులను ఆప్కాస్ ద్వారా భర్తీ చేయాల్సింది పోయి, వాటిలో వందల పోస్టులను ప్రైవేట్ అవుట్‌సోర్సింగ్ ఏజెన్సీలకు అప్పగించడం అన్యాయం.
గ్రామ సచివాలయ ఉద్యోగుల సంక్షేమం పట్టదా?
“గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులపై కూటమి ప్రభుత్వం పనిభారం పెంచి వారిని తీవ్ర ఒత్తిడికి గురిచేస్తోంది. వరుసగా ఉద్యోగులు అకాల మరణాలు చెందుతున్నా ప్రభుత్వం స్పందించడం లేదు. సర్వేల పేరుతో ఉద్యోగులను వేధించడం మానుకోవాలి. అవుట్‌సోర్సింగ్ ఉద్యోగులను ఆప్కాస్ పరిధిలోనే కొనసాగించి, ప్రభుత్వం ద్వారానే నియామకాలు చేపట్టాలి. ఉద్యోగులకు సకాలంలో జీతాలు చెల్లించడంతో పాటు, పెన్షన్, ఇతర బకాయిలను వెంటనే విడుదల చేయాలని ప్రభుత్వాన్ని నలమారు చంద్రశేఖర్‌రెడ్డి డిమాండ్ చేశారు.