మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణతో పేదలకు అన్యాయం
అనంతపురం : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ వల్ల పేదలకు అన్యాయం జరుగుతుందని వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి తెలిపారు. సూపర్ స్పెషాలిటీ వైద్య సేవలు కూడా అందే పరిస్థితి ఉండదన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా సోమవారం జేఎన్‌టీయూ సమీపంలో అనంతపురం రూరల్ పంచాయతీ వైయస్ఆర్‌సీపీ నాయకుల ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. ముఖ్య అతిథిగా అనంత వెంకటరామిరెడ్డి హాజరై సంతకాలు సేకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద, మధ్య తరగతి ప్రజల కోసం ఆలోచించిన నాయకులు డాక్టర్ వైయస్‌ఆర్, వైయస్ జగన్ మాత్రమేనని అన్నారు. వైఎస్ జగన్ విజన్ ఉన్న నాయకుడని.. 2019లో అధికారంలోకి వచ్చాక విద్య, వైద్యానికి పెద్దపీట వేసినట్లు తెలిపారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లోనూ మెడికల్ కళాశాలలు ఉండాలన్న లక్ష్యంతో 17 నూతన ప్రభుత్వ మెడికల్ కళాశాలల నిర్మాణానికి శ్రీకారం చుట్టారని తెలిపారు. కోవిడ్ వంటి పరిస్థితులను అధిగమించి మూడేళ్లలోనే 7 కళాశాలలు అందుబాటులోకి తెచ్చారని అన్నారు. కానీ, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక 10 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్‌పరం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా వైయస్‌ఆర్‌సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణకు మంచి స్పందన వస్తోందని చెప్పారు. అనంతపురంలో ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉండడం వల్లే దానికి అనుబంధంగా సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి వచ్చి నేడు స్పెషాలిటీ వైద్య సేవలు అందుతున్నాయని గుర్తు చేశారు. కార్పొరేట్ చేతుల్లోకి మెడికల్ కాలేజీలు వెళ్తే భవిష్యత్‌లో పేదలకు మెరుగైన వైద్యం అందే పరిస్థితి ఉండదన్నారు. ప్రజా స్పందనను గుర్తించి ప్రభుత్వం తన నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామని తెలిపారు.