ఆగిరిపల్లిలో అక్రమ మైనింగ్  

16 Mar, 2026 16:36 IST

ఏలూరు జిల్లా : ఆగిరిప‌ల్లి మండలంలోని చొప్పరమెట్ల రెవెన్యూ పరిధిలో కూటమి నాయకులు భారీగా అక్రమ మైనింగ్ నిర్వహిస్తున్నారని నూజివీడు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఆరోపించారు. దళితులకు అసైన్మెంట్‌గా ఇచ్చిన భూముల్లోనే అక్రమంగా గ్రావెల్ తవ్వకాలు జరిపి వేల లారీల ద్వారా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారని తెలిపారు. వలస గట్టు దిగువ ప్రాంతంలో దాదాపు 30 సంవత్సరాల క్రితం ప్రభుత్వం పలువురు దళితులకు అసైన్మెంట్ పట్టాలు ఇచ్చిందని, ఆ భూముల్లో ప్రస్తుతం అక్రమ మైనింగ్ జరుగుతోందని పేర్కొన్నారు. ఈ మైనింగ్ కార్యకలాపాలు విజిలెన్స్, మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారుల కనుసన్నల్లోనే జరుగుతున్నప్పటికీ ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు ఆరోపించారు.

ఇక అక్రమ మైనింగ్ కారణంగా ఒక దళిత రైతు తీవ్రంగా నష్టపోయాడని తెలిపారు. అతనికి తెలియకుండా అతని పొలంలో ఉన్న సుమారు 60 మామిడి చెట్లను నరికి గ్రావెల్ తవ్వి తరలించారని ఆరోపించారు. తనకు చెందిన ఒక ఎకరం 96 సెంట్ల అసైన్మెంట్ పట్టా భూమిలో ఈ ఘటన జరిగిందని బాధిత రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. మంత్రి పార్థ‌సార‌ధి పేరు చెప్పి బెదిరింపులకు పాల్పడుతున్నారని కూడా ఆయన తెలిపారు.

ఈ అక్రమ మైనింగ్‌పై వెంటనే విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని, దళిత రైతుకు న్యాయం చేయాలని నూజివీడు నియోజకవర్గ వైయ‌స్ఆర్‌సీపీ నాయకులు డిమాండ్ చేశారు. న్యాయం జరిగే వరకు తమ పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు.