చోడవరంలో ‘వెన్నుపోటుకు రెండేళ్లు’ నిరసన కార్యక్రమం 

8 Jun, 2026 14:57 IST

చోడవరం : వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పిలుపు మేరకు చోడవరం వైయ‌స్ఆర్‌సీపీ కార్యాలయంలో “వెన్నుపోటుకు రెండేళ్లు” కార్యక్రమంలో భాగంగా పార్టీ ముఖ్య నాయకులు, మేధావులు, విద్యావంతులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి మాజీ మంత్రి, ఉమ్మడి గోదావరి జిల్లాల రీజినల్ కోఆర్డినేటర్, చోడవరం నియోజకవర్గ సమన్వయకర్త గుడివాడ అమర్‌నాథ్ అధ్యక్షత వహించారు. 
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో ‘సూపర్-6’ పేరిట ఇచ్చిన హామీలను అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని ఆరోపించారు. ప్రజలకు ఇచ్చిన హామీలను విస్మరించి ప్రచారానికే ప్రాధాన్యం ఇస్తోందని విమర్శించారు.

నిరుద్యోగ భృతి, ఉద్యోగాల కల్పన, ఫీజు రీయింబర్స్‌మెంట్, విద్యార్థుల సంక్షేమం, ఆరోగ్యశ్రీ అమలు వంటి అంశాల్లో ప్రభుత్వం ఆశించిన ఫలితాలు ఇవ్వలేకపోయిందని పేర్కొన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ బకాయిలు పెండింగ్‌లో ఉన్నాయని, ప్రభుత్వ పాఠశాలలు, ఆస్పత్రులు నిర్లక్ష్యానికి గురవుతున్నాయని ఆరోపించారు. మహిళలకు నెలకు రూ.1,500 చొప్పున ఆర్థిక సహాయం అందిస్తామని, ఉచిత గ్యాస్ సిలిండర్లు ఇస్తామని ప్రకటించిన హామీలు పూర్తిస్థాయిలో అమలు కాలేదని విమర్శించారు. కొత్త పెన్షన్లు, పక్కా గృహాల మంజూరులోనూ ప్రభుత్వం విఫలమైందని పేర్కొన్నారు.

ఈ సందర్భంగా చోడవరం సహకార చక్కెర కర్మాగారం మూతపడిన అంశాన్ని ప్రస్తావిస్తూ, చెరుకు రైతులు మరియు ఫ్యాక్టరీ కార్మికులకు బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లేదంటే రైతుల తరఫున వైయ‌స్ఆర్‌సీపీ పెద్ద ఎత్తున ఉద్యమం చేపడుతుందని హెచ్చరించారు. రానున్న ఎస్‌ఐఆర్ కార్యక్రమంలో బీఎల్‌ఏలు క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా పనిచేయాలని సూచించారు. పార్టీ పట్ల విధేయత, బాధ్యతతో పనిచేసే కార్యకర్తలకు తగిన గుర్తింపు, గౌరవం ఉంటుందని తెలిపారు. అనంతరం సభా ప్రాంగణంలో ఏర్పాటు చేసిన ఫోటో ఎగ్జిబిషన్‌ను నాయకులు పరిశీలించారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు, అనుబంధ విభాగాల ప్రతినిధులు, జెడ్పీటీసీలు, ఎంపీపీలు, మండల, టౌన్ అధ్యక్షులు, మాజీ ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.