మే 4న మార్కాపురంలో కృష్ణా జలాలపై వైయస్ఆర్‌సీపీ సదస్సు
మార్కాపురం: కృష్ణా జలాల వినియోగం, రాయలసీమ ప్రాంత అభివృద్ధి అంశాలపై వైయస్ఆర్‌సీపీ విస్తృత స్థాయిలో సదస్సు నిర్వహించేందుకు సిద్ధమైంది. మే 4వ తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు మార్కాపురం జిల్లా కేంద్రంలోని “సౌజన్య ఫంక్షన్ హాల్” వేదికగా ఈ సదస్సు జరగనుంది.
రాయలసీమ జిల్లాలు, అలాగే పూర్వపు రాయలసీమలో భాగమైన మార్కాపురం ప్రాంత రైతాంగం అవసరాలు, ప్రయోజనాల దృష్ట్యా కృష్ణా జలాల వినియోగ ఆవశ్యకతపై సమగ్రంగా చర్చించేందుకు ఈ సదస్సును నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ లిప్ట్ ఇరిగేషన్ పథకం , వెలిగొండ ప్రాజెక్ట్ పనుల పురోగతిపై లోతైన చర్చ జరగనుంది. సదస్సు నిర్వహణపై ప్రకాశం–మార్కాపురం ఉమ్మడి జిల్లాల వైయస్ఆర్‌సీపీ అధ్యక్షులు, దర్శి ఎమ్మెల్యే బూచేపల్లి శివప్రసాద్‌రెడ్డి, గిద్దలూరు మాజీ ఎమ్మెల్యే, మార్కాపురం నియోజకవర్గ ఇన్‌చార్జ్ అన్నా రాంబాబు మంగళవారం సన్నాహక సమావేశం నిర్వహించారు.
ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, పశ్చిమ ప్రాంత వరప్రదాయని అయిన వెలుగొండ ప్రాజెక్ట్ పనులను వేగవంతం చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కరవు బాధిత ప్రాంతాల కోసం రూపొందించిన ఈ ప్రాజెక్ట్, అలాగే రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలిచిపోతే రాయలసీమతో పాటు ప్రకాశం, మార్కాపురం జిల్లాల రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేశారు.
రాష్ట్ర స్థాయి నాయకులు, మేధావులు, నిపుణులు, రైతు నాయకులు పాల్గొననున్న ఈ సదస్సును విజయవంతం చేయడానికి స్థానిక నాయకులు, కార్యకర్తలను సిద్ధం చేస్తున్నారు. రైతాంగ సమస్యలపై స్పష్టమైన దిశానిర్దేశం ఇవ్వాలన్న లక్ష్యంతో ఈ సదస్సు నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు.