భక్తులను అవమానిస్తున్న చంద్రబాబుపై చర్యలు తీసుకోండి
అమరావతి: తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే భక్తులను కించపరిచే విధంగా చంద్రబాబు, టీడీపీ సోషల్ మీడియా ప్రవర్తిస్తుందని, వారిపై తక్షణమే చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి కె.విజయానంద్‌కు వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ ఫిర్యాదు చేసింది. వైయస్‌ఆర్ సీపీ ప్రధాన కార్యదర్శి లేళ్ల అప్పిరెడ్డి, ఎంపీ నందిగం సురేష్, ఎమ్మెల్యే మల్లాది విష్ణు, ఇతర ముఖ్యనేతలు ఎన్నికల అధికారిని కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా తిరుమల దర్శనం కోసం ప్రైవేట్ బస్సుల్లో వస్తున్న భక్తులను టీడీపీ అడ్డుకుంటుందని, దొంగ ఓటర్లని ఆందోళన చేస్తూ తిరుపతి పార్లమెంట్ నియోజకవర్గ ప్రజలను టీడీపీ తప్పుదోవ పట్టిస్తుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే సుగుణమ్మ, తుడా మాజీ చైర్మన్ నరసింహ యాదవ్‌పై చర్యలు తీసుకోవాలని కోరారు. దొంగ ఓటర్లు ఉంటే పోలింగ్ బూత్‌లో ఉండే ఏజెంట్లు గుర్తించాలి కానీ, దర్శనానికి వచ్చే భక్తులను అవమానించడం సరికాదన్నారు. చంద్రబాబు, టీడీసీ సోషల్ మీడియాతో పాటు.. ప్రజలను తప్పుదోవపట్టిస్తున్న ఎల్లో మీడియాపై కూడా చర్యలు తీసుకోవాలని కోరినట్టు వారు చెప్పారు.