చంద్రబాబు తీవ్ర అధికార దుర్వినియోగం..

9 May, 2026 08:07 IST

తాడేప‌ల్లి: రాష్ట్రంలో పోలీసు యంత్రాంగం మొత్తాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తన రాజకీయ అవసరాల కోసం వినియోగించుకుంటుండడంతో వ్యవస్థ పూర్తిగా గాడి తప్పిందని మాజీ సీఎం, వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌ మండిపడ్డారు. అసమ్మతిని అణచి వేయడానికి, ప్రశ్నించే గొంతులను నొక్కడానికి పోలీసులను రాజకీయ ఏజెంట్లుగా వాడుకుంటూ ప్రజల భావవ్యక్తీకరణ స్వేచ్ఛను చంద్రబాబు హరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘హలో ఇండియా..!’ ఏపీలో పోలీసు వ్యవస్థను చంద్రబాబు వాడుకుంటున్న తీరును చూడాలంటూ శుక్రవారం ఆయన తన సోషల్‌ మీడియా ఖాతా ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. అందులో ఆయన ఏమన్నారంటే..  

 
రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం
ప్రజాస్వామ్య వ్యవస్థలోని మూల స్తంభాల్లో ఒకటైన వాక్‌ స్వాతంత్య్రాన్ని రాజ్యాంగంలోని ఆర్టికల్‌–19లో పొందుపరిచారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నేతృత్వంలోని టీడీపీ కూటమి ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాల వల్ల ప్రజలకు రాజ్యాంగం కల్పించిన హక్కులకు భంగం వాటిల్లే పరిస్థితి వచ్చింది. ఇంకా చెప్పాలంటే.. రాజ్యాంగ స్ఫూర్తి ప్రమాదంలో పడుతోంది. ఆ స్థాయిలో విమర్శకులను భయపెట్టడానికి, ప్రతిపక్షాల గొంతు నొక్కడానికి, ప్రభుత్వ తప్పిదాలను ఎండగట్టే వారిని బెదిరించడానికి మొత్తం పోలీసు యంత్రాంగాన్ని ఒక రాజకీయ ఆయుధంలా వాడుతున్నారు.


టీడీపీ కూటమి ప్రభుత్వ వైఫల్యాలు, మోసం, అవినీతి, దగా, ప్రజా వ్యతిరేక పాలనను నిలదీస్తున్న సోషల్‌ మీడియా కార్యకర్తలు, వైఎస్సార్‌సీపీ మద్దతుదారులు, పాత్రికేయులతో పాటు సాధారణ పౌరులపైనా రాజకీయ కక్ష సాధింపులు, నిరంకుశ వైఖరి, బెదిరింపులు కొనసాగుతున్నాయి. తీవ్ర అధికార దుర్వినియోగంతో చాలా దారుణంగా వ్యవహరిస్తున్నారు.