ఆర్చ్ బిషప్ డాక్టర్ మల్లవరపు ప్రకాష్ మరణం బాధాక‌రం

8 Jun, 2026 10:16 IST

తాడేపల్లి :విశ్రాంత ఆర్చ్ బిషప్ (అగ్రపీఠాధిపతి) మోస్ట్ రెవరెండ్ డాక్టర్ మల్లవరపు ప్రకాష్ గారి మరణవార్త తనను తీవ్ర దిగ్భ్రాంతికి గురి చేసిందని మాజీ ముఖ్యమంత్రి, వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు వైయస్ జగన్‌మోహన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ మేరకు ఆయన సంతాప సందేశాన్ని విడుదల చేశారు.

క్రైస్తవ ఆధ్యాత్మిక రంగంలో విశిష్ట సేవలందించిన డాక్టర్ మల్లవరపు ప్రకాష్ గారు దశాబ్దాల పాటు క్రైస్త‌వ విశ్వాసుల‌కు మార్గదర్శకులుగా నిలిచారని వైయస్ జగన్ కొనియాడారు. పేదలు, బలహీన వర్గాల సంక్షేమం కోసం, విద్యా , సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా ఆయన సమాజానికి విశేష సేవలందించారని గుర్తుచేశారు.

విజయవాడ డయాసిస్ తొలి తెలుగు బిషప్‌గా, అనంతరం విజయవాడ ఆర్చ్ బిషప్‌గా, విశాఖపట్నం ఆర్చ్ బిషప్‌గా బాధ్యతలు నిర్వహిస్తూ క్రైస్తవ సమాజ అభ్యున్నతికి, ఆధ్యాత్మిక విలువల ప్రచారానికి ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని పేర్కొన్నారు. ఆయన నాయకత్వంలో అనేక మంది విశ్వాసులు ఆధ్యాత్మిక మార్గంలో నడిచారని, సమాజంలో శాంతి, సౌభ్రాతృత్వం, మానవతా విలువల పెంపుదలకు కృషి చేశారని తెలిపారు.

డాక్టర్ మల్లవరపు ప్రకాష్ గారి మరణం క్రైస్తవ సమాజానికే కాకుండా రాష్ట్రానికి తీరని లోటని వైయస్ జగన్ అన్నారు. ఆయన కుటుంబ సభ్యులకు, క్రైస్తవ మత పెద్దలకు, శిష్యులకు, భక్తులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ, ఈ విషాదాన్ని తట్టుకునే మనోధైర్యాన్ని దేవుడు ప్రసాదించాలని ప్రార్థించారు. పరమపదించిన డాక్టర్ మల్లవరపు ప్రకాష్ గారి ఆత్మకు శాంతి చేకూరాలని వైయస్ జగన్ ఆకాంక్షించారు.