మందా సాల్మన్ హత్యకు ప్రభుత్వమే కారణం

17 Jan, 2026 12:59 IST

కర్నూలు: పల్నాడు జిల్లా పిన్నెల్లిలో దళిత వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్త మండా సాల్మన్ హత్యకు కూటమి ప్రభుత్వ వైఖరే కారణమని ఆరోపిస్తూ, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో కర్నూలు పాత బస్టాండ్ సమీపంలోని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహం వద్ద శుక్రవారం ఘన నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్, వైయ‌స్ఆర్‌సీపీ క‌ర్నూలు జిల్లా అధ్య‌క్షుడు ఎస్వీ మోహ‌న్ రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలపై “రెడ్ బుక్ రాజ్యాంగం” అమలు చేస్తున్నారని తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార బలంతో అక్రమ కేసులు, దాడులు, బెదిరింపులు పెరిగిపోయాయని, ముఖ్యంగా దళితులపై జరుగుతున్న అణచివేత అత్యంత ఆందోళనకరంగా మారిందని విమర్శించారు. మందా సాల్మన్‌ను పాశవికంగా హత్య చేయడం రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిన దానికి నిదర్శనమని పేర్కొన్నారు. ఈ హత్యకు కారణమైన వారిని వెంటనే గుర్తించి, కఠిన చర్యలు తీసుకోవాలని, బాధిత కుటుంబానికి పూర్తి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. నిరసన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శ్రీదేవమ్మ, త‌దిత‌రులు పాల్గొన్నారు.