అక్రమ కేసులపై తిరుపతిలో వైయస్ఆర్‌సీపీ శ్రేణుల నిరసన
తిరుపతి: వైయస్ఆర్‌సీపీ నాయకులు, కార్యకర్తలపై నమోదైన కేసులను వ్యతిరేకిస్తూ తిరుపతి నగరంలో పార్టీ శ్రేణులు శాంతియుత నిరసన కార్యక్రమాన్ని చేపట్టాయి. తిరుపతి నియోజకవర్గ సమన్వయకర్త భూమన అభినయ్ రెడ్డి ఆధ్వర్యంలో డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహం వద్ద ఈ నిరసన జరిగింది. ఇటీవల తిరుమల తిరుపతి దేవస్థానం (టీటీడీ) చైర్మన్ బీఆర్ నాయుడు రాజీనామా చేయాలంటూ వైసీపీ నాయకులు నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తిరుచానూరు పోలీస్ స్టేషన్‌లో 13 మంది వైయస్ఆర్‌సీపీ నాయకులు, మహిళలపై కేసులు నమోదు చేయడం తీవ్ర వివాదానికి దారితీసింది.
వైయస్ఆర్‌సీపీ నేతలు ఆరోపిస్తూ, తాము శాంతియుతంగా నిరసన తెలుపుతుండగా టీడీపీ కార్యకర్తలు దాడులకు పాల్పడ్డారని పేర్కొన్నారు. మహిళలపై కూడా దాడులు జరగడం అనైతికమని తీవ్రంగా ఖండించారు. అంతేకాకుండా బాధితులపైనే ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులు నమోదు చేయడం ప్రభుత్వ అధికార దుర్వినియోగమని విమర్శించారు. ఈ సంఘటనల నేపథ్యంలో వైయస్ఆర్‌సీపీ అధిష్టానం రాష్ట్రవ్యాప్తంగా నిరసనలకు పిలుపునిచ్చింది. అందులో భాగంగా తిరుపతిలో ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ విగ్రహం వద్ద నిరసన చేపట్టారు.
ఈ సందర్భంగా భూమన అభినయ్ రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అవమానించేలా వ్యవహరిస్తోందని విమర్శించారు. తిరుపతిలో చెడు రాజకీయ సంప్రదాయాలకు శ్రీకారం చుట్టారని, భవిష్యత్తులో దీనికి భారీ మూల్యం చెల్లించాల్సి వస్తుందని హెచ్చరించారు. నిరసన కార్యక్రమంలో మాజీ ఉపముఖ్యమంత్రి నారాయణస్వామి, చెవిరెడ్డి హర్షిత్ రెడ్డి, ఎమ్మెల్సీ సిపాయి సుబ్రహ్మణ్యం, సత్యవేడు ఇంచార్జి రాజేష్, జిల్లా మహిళా అధ్యక్షురాలు మాధవి రెడ్డి, తిరుపతి నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు.