ఎంపీ మిధున్ రెడ్డి అక్రమ అరెస్టుపై నిరసన జ్వాల
తిరుపతి: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిధున్ రెడ్డి అక్రమ అరెస్టును నిరసిస్తూ శ్రీకాళహస్తి పట్టణంలో గాలిగోపురం వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం వద్ద వైయస్ఆర్‌సీపీ శ్రేణులు నిరసన కార్యక్రమం చేపట్టారు. వైయస్ఆర్‌సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శన చేపట్టి, ఈ ప్రభుత్వానికి మంచి బుద్ధి ప్రసాదించాలని కోరుతూ..మహాత్మాగాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా మధుసూదన్‌రెడ్డి మాట్లాడుతూ..`పెద్దిరెడ్డి మిధున్ రెడ్డి అక్రమ అరెస్టు ని తీవ్రంగా ఖండిస్తున్నాను. మంచి మనిషి రాష్ట్ర అభివృద్ధి కొరకు ఢిల్లీలో పోరాడుతున్నారు. జగనన్న తమ్ముడిగా రాష్ట్ర అభివృద్ధి కొరకు కృషి చేస్తున్న ఎంపీని తమ రాజకీయ లబ్ధి కోసం అరెస్టు చేయడం దారుణం. కూటమి ప్రభుత్వ కక్ష పూరిత రాజకీయాలు ఎల్లకాలం సాగవు. కూటమి అరాచకాలపై ప్రజలు తిరగబడే కాలం దగ్గర్లో ఉంది. మిధున్ రెడ్డి అక్రమ అరెస్టులను రాష్ట్ర ప్రజలు ఖండిస్తున్నారు. మాజీ ఎంపీ ఉండవల్లి అరుణ్ కుమార్ మాటలను చంద్రబాబు నాయుడు గుర్తు చేసుకోవాలి. రానున్న రోజులలో కూటమికి డిపాజిట్లు కూడా రావు.
ప్రశ్నిస్తానని పాలిటిక్స్‌లోకి వచ్చిన పవన్ కళ్యాణ్ ప్రజల సమస్యలను గాలికి వదిలేసి తన సినిమా రేట్లు పెంచుకొని లబ్ధి పొందుతున్నాడు. లిక్కర్ స్కామ్ అనేది వట్టి అభూతకల్పన. వైయస్ఆర్ సీపీ అధినేత వైయస్ జగన్‌కు వస్తున్న ప్రజాదరణ చూసి ఓర్వలేకపోతున్నారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయలేక ప్రజలను డైవర్ట్ చేయడానికి కుట్ర పన్నుతున్నారు. ఇప్పటివరకు మద్యం అక్రమ కేసులు అరెస్ట్ చేసినా.. మా పార్టీ నేతలకు ఎలాంటి ఆధారాలు చూపలేదు. మీరు పెట్టే అక్రమ కేసులకు మా పార్టీ నేతలు ఎవరు భయపడరు. మీరు ఈరోజు చేస్తున్న ప్రతి దానికి భవిష్యత్తులో తగిన మూల్యం చెల్లించుకుంటారు` అని మధుసూదన్‌రెడ్డి హెచ్చరించారు. కార్యక్రమంలో దేవస్థానం మాజీ చైర్మన్ అంజూరూ తారక శ్రీనివాసులు, ఉమ్మడి చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఉన్నాం వాసుదేవ నాయుడు, ఏర్పేడు మండల అధ్యక్షుడు కూనాటి రమణయ్య యాదవ్, తొట్టంబేడు మండల అధ్యక్షుడు కోగిల సుబ్రహ్మణ్యం, సంయుక్త కార్యదర్శి షేక్ సిరాజ్ బాష, శ్రీకాళహస్తి నియోజకవర్గ మైనార్టీ సెల్ అధ్యక్షులు పఠాన్ ఫరీద్,మున్నా రాయల్, తదితరులు పాల్గొన్నారు.