పదవిలో లేకున్నా ప్రజా సేవలో ముందుకు సాగండి
భీమిలి : సర్పంచ్ పదవీకాలం పూర్తయినా ప్రజా సేవ ఆగకూడదని, అదే స్పూర్తితో ప్రజల మధ్య ఉండాలని భీమిలి వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సమన్వయకర్త, ఉమ్మడి విజయనగరం జిల్లా జెడ్పీ ఛైర్పర్సన్, పార్టీ జిల్లా అధ్యక్షుడు మజ్జి శ్రీనివాసరావు (చిన్నశ్రీను) పిలుపునిచ్చారు. భీమిలి నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ ఆధ్వర్యంలో ఆనందపురంలో ఆనందపురం, భీమిలి, పద్మనాభం మండలాలకు చెందిన ఐదేళ్ల పదవీకాలం పూర్తి చేసుకున్న గ్రామ సర్పంచ్‌లకు ఘనంగా ఆత్మీయ సత్కారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన చిన్నశ్రీను సర్పంచ్‌లను సన్మానించారు.
ఈ సందర్భంగా చిన్నశ్రీను మాట్లాడుతూ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి సూచనల మేరకు సర్పంచ్‌ల సేవలను గుర్తించి సత్కరించడం ఆనందంగా ఉందన్నారు. కరోనా మహమ్మారి కారణంగా ఎన్నికలు ఆలస్యమైనప్పటికీ, తమ ప్రభుత్వ కాలంలో సర్పంచ్‌లు గ్రామాల్లో మంచి పాలన అందించారని ప్రశంసించారు. అయితే గత రెండేళ్లుగా కూటమి ప్రభుత్వ సహకారం లేక సర్పంచ్‌లు అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నారని, గ్రామాల్లో సమస్యలు పెరిగినట్టు పేర్కొన్నారు. గ్రామ పంచాయతీలకు నిధులు ఇవ్వకుండా ప్రభుత్వం పక్షపాత ధోరణి ప్రదర్శిస్తోందని విమర్శించారు. అధికారులు, అధికార పార్టీ సహకరించకపోయినా ప్రజల పక్షాన నిలబడి సేవలు అందించాలని సర్పంచ్‌లను కోరారు. స్థానిక సంస్థల ఎన్నికలు త్వరలో జరిగే అవకాశం లేదని, అప్పటి వరకు సర్పంచ్ హోదాతోనే ప్రజలకు సేవలు అందించాలని సూచించారు.
చిన్నశ్రీను సొల్జర్స్ అధ్యక్షురాలు సిరమ్మ మాట్లాడుతూ, వైయస్ఆర్‌సీపీ పాలనలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా గ్రామ స్వరాజ్యానికి ప్రాధాన్యం పెరిగిందని గుర్తు చేశారు. సర్పంచ్‌లు తమ ప్రభావాన్ని కొనసాగిస్తూ ప్రజలకు సేవలు అందించాలని కోరారు. అందరం కలిసికట్టుగా శ్రమించి తిరిగి జగనన్న ప్రభుత్వాన్ని తీసుకురావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ పరిశీలకులు, మండలాధ్యక్షులు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, మహిళా విభాగ నాయకులు, కార్యకర్తలు, సర్పంచ్‌లు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.