కూటమి ప్రభుత్వంపై సంఘటిత పోరాటం
అనంతపురం : కూటమి ప్రభుత్వంపై సంఘటిత పోరాటానికి సిద్ధం కావాలని వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షుడు అనంత వెంకటరామిరెడ్డి పిలుపునిచ్చారు. గురువారం వైయస్ఆర్‌సీపీ జిల్లా కార్యాలయంలో ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు నరసింహులు అధ్యక్షతన ఎస్సీ సెల్ జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా అనంత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దళిత సామాజిక వర్గంపై దాడులు అధికమయ్యాయని అన్నారు. పార్టీలో ఎవరికైనా విభేధాలు ఉంటే పక్కన పెట్టి క్షేత్రస్థాయి నుంచి వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయాలని సూచించారు. వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో దళితులకు పెద్దపీట వేశారన్నారు. దళిత మహిళను హోంమంత్రిని చేశారని గుర్తు చేశారు. 2019 నుంచి 2024 వరకు ఐదేళ్ల వైయస్ఆర్‌సీపీ పాలనలో ఎస్సీల సంక్షేమం కోసం ఏకంగా రూ.70 వేల కోట్లు ఖర్చు చేసినట్లు తెలిపారు. దేశ చరిత్రలో ‘‘నా ఎస్సీ, నా ఎస్టీ’’ అంటూ దళితులను అక్కున చేర్చుకున్న నాయకుడు వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి మాత్రమేనని కొనియాడారు.
వైయస్ జగన్ పాలనలో సామాజిక న్యాయానికి పెద్దపీట వేశామన్నారు. డిబీటీ, నాన్ డీబీటీ కింద ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందించామన్నారు. దళితులను పేదరికం నుంచి బయటకు తీసుకొచ్చేందుకు కృషి చేశామన్నారు. రాజకీయ, సామాజిక న్యాయం చేశామని తెలిపారు. పేదల పిల్లలు కూడా ఉన్నత చదువులు అభ్యసించేలా చేశామన్నారు. పోటీ ప్రపంచంలో రాణించేలా ప్రభుత్వ బడుల్లో ఇంగ్లిష్ మీడియం ప్రారంభిస్తే అప్పటి ప్రతిపక్ష నేతలు వ్యతికించిన విషయాన్ని గుర్తు చేశారు. డాక్టర్ బీఆర్ అంబేద్కర్ ఆశయ సాధన కోసం పరితపించిన నాయకుడు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి అని కొనియాడారు.
దేశంలోనే ఎక్కడా లేని విధంగా విజయవాడలో 205 అడుగుల అంబేడ్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి గౌరవించారన్నారు. కానీ నేడు కూటమి ప్రభుత్వంలో దళితులపై దాడులు అధికమయ్యాయని, అందరూ కలిసికట్టుగా పోరాటం చేయాలని పిలుపునిచ్చారు. దళితులకు ఎక్కడ అన్యాయం జరిగినా ఎస్సీ విభాగం ముందుండాలని సూచించారు. వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీకి దళితులు, గిరిజనులు పట్టుకొమ్మలని అన్నారు. దళితుల సమస్యలపైనే కాకుండా గ్రామ స్థాయిలో నెలకొన్న సమస్యలను కూడా వెలుగులోకి తీసుకురావాలని తెలిపారు. రానున్న రోజుల్లో మండల, గ్రామ స్థాయిలో ఎస్సీ సెల్ సమావేశాలు నిర్వహించాలని సూచించారు. మరో ఆరు నెలల్లో స్థానిక సంస్థల ఎన్నికలు వస్తున్నాయని, ఆ ఎన్నికల్లో వైయస్ఆర్‌సీపీ సత్తా ఏమిటో చూపించాలన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో నామినేషన్లు కూడా వేయకుండా చేయడం కోసమే రాష్ట్ర వ్యాప్తంగా వైయస్ఆర్‌సీపీ నేతలపై దాడులు, అక్రమ కేసులు బనాయిస్తున్నారని తెలిపారు.
దళితుల్లో నాయకత్వం లేకుండా చూడాలన్న కుట్ర జరుగుతోందని, అందులో భాగంగానే మాజీ ఎంపీ నందిగం సురేష్‌పై కేసులు పెట్టి వేధిస్తున్నారని తెలిపారు. ఇలాంటి తరుణంలో ప్రతి ఒక్కరూ వ్యూహాత్మకంగా ముందుకు సాగాలని సూచించారు. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ‘రీకాల్ చంద్రబాబు మేనిఫెస్టో’ కార్యక్రమాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని తెలిపారు. ఈనెల 15వ తేదీ నుంచి గ్రామగ్రామానికి వెళ్లి ప్రజలకు చంద్రబాబు చేసిన మోసాలను వివరించాలన్నారు. పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తప్పకుండా న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఎస్సీ సెల్ జిల్లా కార్యవర్గంతో ప్రమాణ స్వీకారం చేయించారు. కార్యక్రమంలో ఎస్సీ సెల్ రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులు పాల్గొన్నారు.