ఆర్డీటీ కోసం ప్రజా ఉద్యమం తథ్యం
అనంతపురం : ఆర్డీటీకి ఫారిన్ కాంట్రిబ్యూషన్ రెగ్యులేషన్ (ఎఫ్‌సీఆర్‌ఏ) రిజిస్ట్రేషన్‌ను రెన్యూవల్ చేసే విషయంలో ఇంకా ఆలస్యం జరిగితే ప్రజా ఉద్యమం తథ్యమని వైయస్ఆర్‌సీపీ అనంతపురం జిల్లా అధ్యక్షులు అనంత వెంకటరామిరెడ్డి హెచ్చరించారు. తాను ఒక పార్టీకి ప్రతినిధిగా ఈ మాటలు చెప్పడం లేదని, జిల్లా పౌరుడిగా.. ఇక్కడ ఆర్డీటీ అందిస్తున్న సేవలను దగ్గరగా చూసిన వాడిగా చెబుతున్నానని అన్నారు. ఆర్డీటీకి ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ డిమాండ్ చేస్తూ అనంతపురం కలెక్టరేట్ ఎదుట ఎస్సీ, ఎస్టీ సంఘాల జేఏసీ రాష్ట్ర అధ్యక్షుడు సాకే హరి అధ్యక్షతన సోమవారం రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఈ దీక్షలకు అనంత వెంకటరామిరెడ్డి సంఘీభావం తెలిపి మాట్లాడారు. ఆర్డీటీ అనేది స్వచ్ఛంద సంస్థ మాత్రమే కాదని, ఇక్కడి ప్రజల జీవితాల్లో భాగం.. భావోద్వేగం అని అన్నారు. వెనుకబడిన ఈ జిల్లాలో ప్రజల కష్టాలను గమనించిన ఫాదర్ విన్సెంట్ ఫెర్రర్ ఆర్డీటీ ద్వారా ఎన్నో సేవా కార్యక్రమాలను చేపట్టారని గుర్తు చేశారు. ఆర్డీటీకి విదేశాల్లో ఉన్న ఎంతో మంది దాతలు ఆర్థికంగా చేయూత అందించారన్నారు.
ఐదున్నర దశాబ్ధాలుగా ఆర్డీటీ ఎంతో మంది జీవితాల్లో వెలుగులు నింపిందని తెలిపారు. అలాంటి సంస్థకు ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ చేయకపోవడంతో ఆర్డీటీ సేవలకు అంతరాయం ఏర్పడిందన్నారు. దీని ఫలితంగా ప్రజలంతా ఆందోళన చెందుతున్నట్లు చెప్పారు. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు తాను విజ్ఞప్తి లేఖలు రాశానని గుర్తు చేశారు. ఇక్కడి ప్రజాప్రతినిధులు కూడా సీఎం చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఈ క్రమంలో మీరు కేంద్రం వద్దకు వెళ్లి మాట్లాడండి అంటూ చంద్రబాబు తప్పించుకునే ధోరణలో మాట్లాడడం తగదన్నారు. రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఆర్డీటీని కాపాడాల్సిన బాధ్యత చంద్రబాబుపై ఉందన్నారు. సంస్థ కార్యకలాపాలు సజావుగా సాగేలా సీఎం చంద్రబాబే ప్రత్యేక చొరవ తీసుకోవాలని కోరారు. కేంద్రంలో, రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వాలే అధికారంలో ఉన్నాయని గుర్తు చేశారు. ప్రజలు అండగా ఉన్న ఆర్డీటీని గుప్పెట్లో పెట్టుకోవాలని భావించొద్దని అన్నారు. ఆర్డీటీ సేవలు ఆగితే ఆ సంస్థకు వచ్చే నష్టం ఏమీ లేదని, కానీ ఇక్కడి ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ, వెనుకబడిన ప్రాంతాల్లోని ప్రజలకు నష్టం జరుగుతుందని తెలిపారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణలోని ఎన్నో ప్రాంతాల్లో ఆర్డీటీ సేవా కార్యక్రమాలు చేస్తోందని చెప్పారు. కేంద్రం కూడా ఆర్డీటీని మతం కోణంలో చూడొద్దని సూచించారు. ఆర్డీటీకి ప్రజల అండ ఉందని, ఎఫ్‌సీఆర్‌ఏ రెన్యూవల్ విషయంలో ఇంకా ఆలస్యం జరిగితే ఈ రోజు సాకే హరి నాయకత్వంలో ప్రారంభమైన ఆందోళనలు అనతికాలంలోనే ప్రజా ఉద్యమంగా మారుతాయని హెచ్చరించారు. చంద్రబాబు కూడా రాయలసీమ వాసేనని, ఆర్డీటీ అందిస్తున్న సేవలు ఎలాంటివో ఆయనకు కూడా తెలుసన్నారు. మాయమాటలు చెప్పి కాలయాపన చేయకుండా తక్షణం ఆర్డీటీ కార్యకలాపాలు సజావుగా సాగేలా ముఖ్యమంత్రి చంద్రబాబు బాధ్యత తీసుకుని కేంద్రంతో మాట్లాడాలని సూచించారు.