ప్రశ్నిస్తే రౌడీషీట్లా?
విజయవాడ: రాష్ట్రంలో ప్రశ్నించే విద్యార్థి, యువజన సంఘాల నాయకులపై రౌడీ షీట్లు ఓపెన్ చేసి, అక్రమ అరెస్టులు చేస్తూ ‘రెడ్ బుక్ పాలన’ నారా లోకేష్ నేతృత్వంలో కొనసాగుతోందని వైయస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఏ. రవిచంద్ర తీవ్రంగా విమర్శించారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వ అక్రమ నిర్బంధాలకు వ్యతిరేకంగా రాష్ట్రవ్యాప్తంగా ఇచ్చిన పిలుపులో భాగంగా శుక్రవారం విజయవాడ లెనిన్ సెంటర్‌లో యువజన, విద్యార్థి సంఘాల ఐక్య వేదిక ఆధ్వర్యంలో నల్ల రిబ్బన్ సంకెళ్లతో భారీ ధర్నా నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో ఏఐవైఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి. రాజేంద్ర బాబు, వైయస్ఆర్ సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొరివి చైతన్య, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి. వలరాజు, పీడీఎస్‌యూ రాష్ట్ర కార్యదర్శి ఐ. రాజేష్ తదితరులు పాల్గొన్నారు. ఏఐవైఎఫ్, వైయస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం, ఏఐఎస్ఎఫ్, వైయస్ఆర్ సీపీ యువజన విభాగం, పీడీఎస్‌యూ, ఎన్‌ఎస్‌యూఐ, పీవైఎల్, నిరుద్యోగ జేఏసీ ఆధ్వర్యంలో ఈ నిరసన జరిగింది.
ఈ సందర్భంగా రవిచంద్ర మాట్లాడుతూ… రాష్ట్రంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఉద్యమాలు చేస్తున్న విద్యార్థి, యువజన సంఘాల నేతలపై అక్రమ కేసులు పెట్టడం, రౌడీషీట్లు ఓపెన్ చేయడం అన్యాయమని అన్నారు. ఎన్నికల హామీల అమలు కోరితే కేసులు నమోదు చేసి జైళ్లకు పంపడం రెడ్ బుక్ అరాచక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ‘రెడ్ బుక్ మంత్రి’గా మారారని తీవ్ర విమర్శలు గుప్పించారు.
ఎన్నికల సమయంలో నిరుద్యోగులకు, విద్యార్థులకు ఇచ్చిన ‘మెగా డీఎస్సీ’, ‘జాబ్ క్యాలెండర్’, ‘ఫీజు రీయింబర్స్‌మెంట్’ హామీల అమలు కోరడం నేరమా? అని ప్రశ్నించారు. తమ వ్యక్తిగత లాభాల కోసం కాకుండా ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని అడిగితే అక్రమంగా జైలుకు పంపడం దుర్మార్గమన్నారు.
విశాఖపట్నంలో విద్యార్థి నాయకులపై పెట్టిన అక్రమ రౌడీషీట్లను వెంటనే ఎత్తివేయాలని డిమాండ్ చేశారు. యువజన, విద్యార్థుల భవిష్యత్తుతో ఆడుకుంటూ వారిని నేరస్తులుగా చిత్రీకరించే ప్రయత్నాలను ప్రభుత్వం మానుకోవాలని హెచ్చరించారు.
ప్రతిపక్షంలో ఉన్నప్పుడు యువజన, విద్యార్థి సంఘాలపై కేసులు ఉండవని చెప్పిన నారా లోకేష్, అధికారంలోకి రాగానే ప్రశ్నించే గొంతులను అణిచివేస్తున్నారని ఆరోపించారు. వంద రోజుల్లో హామీలు అమలు చేయకపోతే కాలర్ పట్టుకోండని చెప్పిన లోకేష్‌కు ఇప్పుడు పంతొమ్మిది నెలలు గడిచినా హామీలు అమలు చేయలేకపోయారని విమర్శించారు.
అణచివేతతో ఉద్యమాలను ఆపలేరని, పోలీసు లాఠీలు, అక్రమ కేసులు, గృహ నిర్బంధాలతో ప్రజా ఉద్యమాలను నిలిపివేయడం సాధ్యం కాదని స్పష్టం చేశారు. ఇది ప్రజాస్వామ్య దేశమే కానీ నియంతృత్వ రాజ్యం కాదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.
రాష్ట్రవ్యాప్తంగా నిరసనకారులపై పెట్టిన అక్రమ కేసులను వెంటనే ఉపసంహరించుకోవాలని, ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం స్పష్టమైన ప్రకటన చేయాలని డిమాండ్ చేశారు. ఈ డిమాండ్లు నెరవేర్చకపోతే రాష్ట్రవ్యాప్తంగా మరింత ఉధృతమైన నిరసనలు చేపడతామని నాయకులు హెచ్చరించారు.
ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేసరి శివారెడ్డి, వైయస్ఆర్ సీపీ యువజన విభాగం నాయకులు మాతా మహేష్, కేసరి రాజశేఖర్ రెడ్డి, ఐ. శ్రీనివాస్, రంజిత్, జగదీష్, నవీన్, ఉదయ్ రెడ్డి, సురేష్, బాబీ, ఎస్. లాల్ మోహన్, ఎల్. ధీరజ్ కృష్ణ, ఆనందు, ధనుష్, యేసుకరున తదితరులు పాల్గొన్నారు.