నేడు `వైయస్ఆర్ కల్యాణమస్తు, షాదీ తోఫా`కు శ్రీకారం
తాడేపల్లి: వైయస్ఆర్ కల్యాణమస్తు, వైయస్ఆర్ షాదీ తోఫా పథకాలకు ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నేడు శ్రీకారం చుట్టున్నారు. వైయస్ఆర్ సీపీ మేనిఫెస్టోలోని మరో హామీ మరికాసేపట్లో అమలుకానుంది. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లో ఆడబిడ్డల పెళ్లిళ్లకు నిరుపేద తల్లిదండ్రులపై భారం కాకూడదన్న లక్ష్యంతో వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం వైయస్ఆర్ కల్యాణ మస్తు, వైయస్ఆర్ షాదీ తోఫా పథకం తీసుకొచ్చింది. ఈ పథకం ద్వారా అర్హులైన లబ్ధిదారుల బ్యాంక్ ఖాతాల్లో నేడు ఆర్థిక సాయం జమకానుంది. ఈ పథకాల కింద రాష్ట్రంలోని అర్హులైన 4,536 మంది లబ్ధిదారులకు రూ.38.18 కోట్ల ఆర్థిక సాయాన్ని ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్రెడ్డి నేడు తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో బటన్ నొక్కి వారి ఖాతాల్లో జమ చేయనున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలు, విభిన్న ప్రతిభావంతులు, భవన నిర్మాణ కార్మికుల కుటుంబాల్లోని ఆడపిల్లలకు వైయస్ఆర్ కల్యాణమస్తు, ముస్లిం మైనార్టీ వర్గాల ఆడపిల్లలకు వైయస్ఆర్ షాదీ తోఫా ద్వారా ప్రభుత్వం ఆర్థిక సాయం చేస్తోంది.
2022 అక్టోబర్ నుంచి డిసెంబర్ మధ్య త్రైమాసికంలో వివాహం చేసుకున్న వారికి వీటి ద్వారా లబ్ధి చేకూర్చనుంది. పేదింటి ఆడబిడ్డలను చదువులో ప్రోత్సహించడం, బాల్య వివాహాలను అరికట్టడం, విద్యా సంస్థల్లో చేరికల శాతాన్ని పెంచడం, డ్రాప్ అవుట్ల రేట్ తగ్గించడమే లక్ష్యంగా ప్రభుత్వం ఈ పథకాలను అమలు చేస్తోంది. ఇందులో భాగంగానే వివాహం చేసుకునే వధూవరులకు 10వ తరగతి ఉత్తీర్ణత తప్పనిసరి చేసింది. లంచాలు, వివక్షతకు తావులేకుండా గ్రామ, వార్డు సచివాలయాలు, వలంటీర్లు ద్వారా లబ్ధిదారులను పారదర్శకంగా ఎంపిక చేస్తోంది. ఈ పథకం సాయాన్ని ప్రతి మూడు నెలలకు లబ్ధిదారులకు అందిస్తుంది. వివాహమైనవారు 30 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలి.