చంద్రబాబు అధికారంలోకి వచ్చిన ప్రతీసారి సీమకు నష్టమే
వైయస్ఆర్ జిల్లా: టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు అధికారంలోకి వచ్చిన ప్రతీసారి రాయలసీమకు నష్టం జరిగిందని వైయస్ఆర్‌సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్ రెడ్డి ఆరోపించారు. రాయలసీమ ఎడారిగా మారడానికి చంద్రబాబే ప్రధాన కారణమని తీవ్రంగా విమర్శించారు. ఆనాడు కర్ణాటకలో ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంచుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు చూస్తూ ఊరుకున్నారని విమర్శించారు. దేవగౌడను ప్రధానిని చేశానని చంద్రబాబు గొప్పలు చెప్పుకుంటూనే, ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంపును అడ్డుకోలేకపోయారని అన్నారు. 2014లో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత కూడా ఆలమట్టి డ్యామ్ ఎత్తు పెంపునకు డీపీఆర్ సమర్పించడం రాష్ట్ర ప్రయోజనాలకు విరుద్ధమని పేర్కొన్నారు.
ఏ సందర్భంలోనూ రాష్ట్ర ప్రయోజనాలను కాపాడేందుకు చర్యలు తీసుకోలేదని, వైయస్ఆర్ , వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి చేపట్టిన ప్రాజెక్టులపై మాత్రం టీడీపీ నేతలతో కోర్టుల్లో కేసులు వేయించారని ఆరోపించారు. తెలంగాణ, మహారాష్ట్ర ప్రభుత్వాలు ఆలమట్టి అంశంపై కోర్టులను ఆశ్రయించినప్పటికీ చంద్రబాబు మాత్రం స్పందించలేదని విమర్శించారు. కర్ణాటక ప్రభుత్వం 150 టీఎంసీల నీటి నిల్వ సామర్థ్యాన్ని పెంచుకుంటున్నప్పటికీ చంద్రబాబు మౌనం పాటిస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితిని అడ్డుకునేందుకు పెద్ద ఎత్తున ఉద్యమాలు చేయాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు. కర్ణాటక వైఖరి కారణంగా రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్‌తో పాటు ఇతర ప్రాజెక్టులకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని తెలిపారు. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించకపోతే భవిష్యత్తులో రాయలసీమ ప్రజలు కనీసం తాగునీటి సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుందని హెచ్చరించారు. శిష్యుడి కోసం ఫోరెన్సిక్ ల్యాబ్ ఘటనను కారణంగా చూపుతూ రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టును పణంగా పెట్టారని చంద్రబాబుపై పి. రవీంద్రనాథ్ రెడ్డి తీవ్ర స్థాయిలో ఆరోపణలు చేశారు.