కూటమి పాలనలో అభివృద్ధి తిరోగమనం
వైయస్ఆర్ జిల్లా: కూటమి ప్రభుత్వ పాలనలో అభివృద్ధి తిరోగమనంలో ఉందని వైయస్ఆర్ జిల్లా వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్‌రెడ్డి మండిపడ్డారు. వియన్ పల్లి మండలం అనిమెల గ్రామంలో సోమవారం `బాబు ష్యూరిటీ- మోసం గ్యారెంటీ` కార్యక్రమంలో భాగంగా కమలాపురం నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ సమన్వయకర్త నరేన్ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో రీ కాలింగ్ చంద్రబాబు మేనిఫెస్టోపై ఇంటింటా ప్రచారం నిర్వహించారు. ఈ క్రమంలో అనిమెల గ్రామంలో నాటి రైతు భరోసా కేంద్రానికి తాళం వేయడం పట్ల ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్‌రెడ్డి మాట్లాడుతూ.. వైయస్ఆర్‌సీపీ ప్రభుత్వంలో రైతులను చేయి పట్టి నడిపించేందుకు నాటి ముఖ్యమంత్రి వైయస్ జగన్ మోహన్ రెడ్డి గ్రామానికో రైతు భరోసా కేంద్రాన్ని ఏర్పాటు చేశారన్నారు. ఈ రైతు భరోసా కేంద్రాల్లో రైతులకు నాణ్యమైన ఎరువులు, పురుగు మందులు, విత్తనాలు అందజేసి అన్ని రకాల సేవలు ఒకేచోట లభించే విధంగా చర్యలు తీసుకున్నారని తెలిపారు. పెట్టుబడి నిధులు మంజూరు, ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు, పంట పండించక ముందే ఆయా పంటలకు మద్దతు ధర, విపత్తుల సమయంలో బీమా సౌకర్యం, ఇన్‌పుట్ సబ్సిడీ, ధాన్యం కొనుగోలు కేంద్రాల ఏర్పాటు వంటి అనేక సౌకర్యాలు కల్పించామన్నారు. కానీ నేడు ఆ పరిస్థితి లేదని, రైతులను అన్ని విధాలుగా కూటమి ముంచేసిందని ధ్వజమెత్తారు. రైతు భరోసా కేంద్రాల పేరు మార్చి నియోపయోగంగా మార్చారని మండిపడ్డారు. రైతులకు పెట్టుబడి సాయం అందడం లేదని, ఉచిత పంటల బీమా జాడే లేదన్నారు. ఉచిత బస్సు ఊసే లేదని, ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారో అంతుపట్టడం లేదన్నారు. అన్ని రకాల ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వానికి ప్రజలు గుణపాఠం చెబుతారని రవీంద్రనాథ్‌రెడ్డి హెచ్చరించారు.