కార్యకర్తలే కేంద్రంగా వైయ‌స్ఆర్‌  కాంగ్రెస్ సంస్థాగత నిర్మాణం

26 Jan, 2026 18:31 IST

నెల్లూరు జిల్లా: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గంలోని బ్రాహ్మణపల్లి గ్రామంలో సోమవారం వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశం ఘనంగా నిర్వహించారు. మేకపాటి రాజగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో తిరుపతి ఎంపీ, ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ కమిటీల టాస్క్ ఫోర్స్ ఇంచార్జ్ మద్దిల గురుమూర్తి ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారు.

ఈ కార్యక్రమంలో ఉమ్మడి నెల్లూరు జిల్లా పార్టీ అధ్యక్షులు డా. కాకాణి గోవర్ధన్ రెడ్డి, నెల్లూరు పార్లమెంట్ పరిశీలకులు జంకే వెంకట్ రెడ్డి, మాజీ జడ్పీ చైర్మన్ బొమ్మిరెడ్డి రాఘవేంద్ర రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి గూడపురెడ్డి శేఖర్ రెడ్డి, జిల్లా స్టూడెంట్ విభాగం అధ్యక్షులు అస్రిత్ రెడ్డి, మండల కన్వీనర్లు, నియోజకవర్గ నాయకులు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు.

ఈ సందర్భంగా ఎంపీ మద్దిల గురుమూర్తి మాట్లాడుతూ..పార్టీకి ప్రాణవాయువైన కార్యకర్తలకు గ్రామ స్థాయి నుంచే సరైన గుర్తింపు, బాధ్యతలు కల్పించాలనే లక్ష్యంతోనే వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాన్ని ప్రారంభించిందన్నారు. ఎన్నాళ్లుగానో నిస్వార్థంగా పనిచేస్తున్న కార్యకర్తలకు తగిన గుర్తింపు లేదన్న వాస్తవాన్ని గుర్తించిన పార్టీ అధినేత వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి, భవిష్యత్తులో పార్టీని కూడా, ప్రభుత్వాన్ని కూడా గ్రామ స్థాయిలో కార్యకర్తల ద్వారానే నడిపించాలనే దృఢ సంకల్పంతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారని తెలిపారు.

గ్రామ స్థాయిలో సరైన వ్యక్తికి సరైన బాధ్యతలు అప్పగిస్తూ, ప్రజాస్వామ్య పద్ధతిలో క్యాడర్‌ను కేంద్రంగా పెట్టుకుని పార్టీని బలోపేతం చేయడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ఈ విధానంతో గ్రామాల్లో పార్టీ కార్యక్రమాలు మరింత సమర్థవంతంగా అమలవుతాయని, రాబోయే రోజుల్లో చేపట్టే ప్రజాప్రయోజన కార్యక్రమాల్లో కార్యకర్తల పాత్ర మరింత కీలకమవుతుందని చెప్పారు.

ప్రస్తుతం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం చేస్తున్న ప్రజావ్యతిరేక విధానాలు, అరాచకాలను సమిష్టిగా ఎదుర్కోవడానికి ఈ సంస్థాగత నిర్మాణం ఎంతో దోహదపడుతుందని ఎంపీ పేర్కొన్నారు. ప్రభుత్వ వైఫల్యాలను గ్రామ స్థాయిలో ప్రజలకు వివరించే అవకాశాన్ని ఈ కార్యక్రమం కల్పిస్తుందని, ఏ సమస్య వచ్చినా కలిసికట్టుగా పోరాడేందుకు పార్టీ క్యాడర్ సిద్ధంగా ఉంటుందని స్పష్టం చేశారు.

వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కులాలు, మతాలు, వర్గాలు, పార్టీలకు అతీతంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలు అమలు చేసి రాష్ట్రాన్ని సమర్థవంతంగా పాలించారని ఎంపీ గుర్తు చేశారు. ప్రస్తుతం ఉన్న ప్రభుత్వం అవినీతి, అప్పులు, ప్రతిపక్షాలపై దాడులు, ఎస్సీ, ఎస్టీ, బీసీ వర్గాలు అలాగే వైయ‌స్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల గొంతు నొక్కే విధానాల్లో ముందుండటం ప్రజలు గమనిస్తున్నారని అన్నారు.

ఈ వాస్తవాలను ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లగలిగితే రాబోయే రోజుల్లో వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి అవుతారని, అలాగే నియోజకవర్గ స్థాయిలో రాజగోపాల్ రెడ్డి అన్నను అత్యధిక మెజారిటీతో గెలిపించి రాష్ట్రాన్ని తిరిగి ప్రగతి పథంలో నడిపించగలమని ఎంపీ మద్దిల గురుమూర్తి విశ్వాసం వ్యక్తం చేశారు.