వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీదే అధికారం
విజయవాడ: వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ మెజార్టీ విజయం సాధిస్తుందని ఎగ్జిట్ పోల్స్‌లో క్రెడిబులిటీ ఉన్న సంస్థలన్నీ తేల్చిచెప్పాయని వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి కొలుసు పార్థసారధి అన్నారు. విజయవాడలో ఆన మీడియాతో మాట్లాడుతూ.. వైయస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తొమ్మిది సంవత్సరాలుగా ప్రజల మధ్యే ఉంటున్నారని, ప్రజావ్యతిరేక విధానాలపై అలుపెరగని పోరాటం చేశారని గుర్తు చేశారు. ప్రజా సంకల్ప యాత్ర పేరిట 14 నెలల పాటు ఇడుపులపాయ నుంచి ఇచ్ఛాపురం వరకు 3648 కిలోమీటర్ల పాదయాత్ర చేశారన్నారు. పాదయాత్రలో ప్రజలు పడుతున్న కష్టాలన్నీ తెలుసుకున్నారన్నారు. ప్రజల కష్టాలను దగ్గర నుంచి చూసిన వైయస్ జగన్ వారి బతుకులు బాగుచేసేందుకు నవరత్నాలను ప్రకటించడం జరిగిందన్నారు. నవరత్నాలకు ఆకర్షితులైన ప్రజలు ఒక్కసారి జగనన్నకు అవకాశం ఇవ్వాలని నమ్మారన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యాడన్నారు.