గ్రామాల అభివృద్ధికి కూటమి ప్రభుత్వం మోకాలాడ్డు
విజయవాడ: గ్రామాల అభివృద్ధిని అడ్డుకుంటున్న కూటమి ప్రభుత్వ విధానాలు వెంటనే మారాలని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి డిమాండ్ చేశారు. విజయవాడలోని పంచాయతీరాజ్ కమిషనర్ కార్యాలయంలో ఆయన ఆధ్వర్యంలో నాయకులు కలిసి కమిషనర్‌కు సర్పంచుల సమస్యలపై వినతి పత్రం సమర్పించారు.
ఈ సందర్భంగా వెన్నపూస రవీంద్రారెడ్డి మాట్లాడుతూ, గతంలో వైయస్ జగన్ మోహన్ రెడ్డి పాలనలో గ్రామ స్వరాజ్యమే లక్ష్యంగా పలు అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టగా, ప్రస్తుత ప్రభుత్వం సర్పంచులపై కక్ష సాధింపు చర్యలకు దిగుతోందని ఆరోపించారు. గ్రామాల్లో చేపట్టిన పనులకు బిల్లులు విడుదల చేయకుండా, స్థానిక సంస్థల అభివృద్ధిని నిలిపివేస్తోందన్నారు. గ్రామ పంచాయతీ తీర్మానాల మేరకు చేపట్టిన పనులు ఎం-బుక్‌లో నమోదై ఉన్నప్పటికీ, బిల్లులు చెల్లించకపోవడం అన్యాయమని పేర్కొన్నారు. ఏప్రిల్ 2న సర్పంచుల పదవీకాలం ముగిసిన తర్వాత స్పెషల్ ఆఫీసర్ల నియామకం పేరిట నిధుల దుర్వినియోగానికి ప్రయత్నాలు జరుగుతున్నాయని కమిషనర్ దృష్టికి తీసుకువచ్చారు. ఈ కార్యక్రమంలో వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర కార్యదర్శులు ఫిరోజ్ ఖాన్, బావి, గుంటూరు మరియు కృష్ణా జిల్లాల అధ్యక్షులు దాసరి రాజు, సింహాద్రి వెంకటేశ్వరరావు, నాయకులు సాయి తదితరులు పాల్గొన్నారు.
ప్రధాన డిమాండ్లు:
* సర్పంచులు తమ విధులు నిర్వర్తించకుండా పంచాయతీ సెక్రటరీలు, డిప్యూటీ ఎంపీడీవోల ద్వారా అడ్డుకట్ట వేయడాన్ని నిలిపివేయాలి.
* 24/12/2025న జారీ చేసిన ఉత్తర్వులను రద్దు చేసి, 15వ ఆర్థిక సంఘం నిధులను సర్పంచులు వినియోగించుకునేలా సౌలభ్యం కల్పించాలి.
* కేంద్ర ప్రభుత్వం 15వ ఆర్థిక సంఘం ద్వారా విడుదల చేసిన రూ.1026 కోట్ల నిధులను వెంటనే స్థానిక సంస్థల ఖాతాల్లో జమ చేయాలి.
* గ్రామాభివృద్ధి కోసం ఇప్పటికే చేపట్టిన పనులకు సంబంధించిన బకాయిలను తక్షణమే విడుదల చేయాలి.