పసుపు నీళ్లతో రోడ్ల శుద్ధి చేసిన వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు
తిరుపతి: తిరుమల శ్రీవారి లడ్డూలో జంతు కొవ్వులు కలిపినట్లు ఎలాంటి ఆధారాలు లేవని సుప్రీంకోర్టు నియమించిన సీబీఐ–సిట్ విచారణలో స్పష్టంగా తేలిందని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పేర్కొన్నారు. అయినప్పటికీ సీఎం చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నిజాలను అంగీకరించకుండా తమ కార్యకర్తలతో తప్పుడు ప్రచారం చేయిస్తున్నారని విమర్శించారు.
ఈ నేపథ్యంలో తిరుపతి ఎమ్మెల్యే శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఇస్కాన్ ఆలయం నుంచి అలిపిరి వరకు పాదయాత్ర నిర్వహిస్తూ అసత్య ప్రచారం చేశారని వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపించారు. ఈ తప్పుడు ప్రచారం వల్ల ఆ ప్రాంతం అపవిత్రమైందని భావించిన పార్టీ నాయకులు, యాత్ర జరిగిన ప్రాంతానికి వెళ్లి పసుపు నీళ్లతో రోడ్లను శుద్ధి చేశారు.
ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ తిరుమల తిరుపతి దేవస్థానం పవిత్రతను రాజకీయ ప్రయోజనాల కోసం దెబ్బతీయడం తగదని అన్నారు. భక్తుల మనోభావాలను గౌరవిస్తూ తిరుమల ప్రతిష్టను కాపాడాల్సిన బాధ్యత అందరిపై ఉందని పేర్కొన్నారు. తప్పుడు ప్రచారాలతో ప్రజలను తప్పుదారి పట్టించే ప్రయత్నాలను ఖండించారు.
ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు మల్లం రవిచంద్ర రెడ్డి, కార్పొరేటర్లు, వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.