ఆశ్రమ పాఠశాలను సందర్శించిన నాగులపల్లి ధనలక్ష్మి

9 Feb, 2026 13:17 IST

రంపచోడవరం:  ఫుడ్ పాయిజ‌న్ కార‌ణంగా 91 మంది విద్యార్థులు అస్వస్థతకు గురైన ఘటనపై రంపచోడవరం మాజీ ఎమ్మెల్యే, వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ నాగులపల్లి ధనలక్ష్మి స్పందించారు. ఘటనపై ఆరా తీసేందుకు ఆమె ప్రాంతీయ ఆసుపత్రి, దేవరపల్లి ఆశ్రమ పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా నాగులపల్లి ధనలక్ష్మి మాట్లాడుతూ.. ఆసుపత్రిలో పరిస్థితి తీవ్ర ఆందోళనకరంగా ఉందని అన్నారు. ఒకే మంచంపై ఏడుగురు నుంచి ఎనిమిది మంది విద్యార్థులను ఉంచడం బాధాకరమని పేర్కొన్నారు. గిరిజన విద్యార్థులకు కనీస భద్రత కూడా కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారని విమర్శించారు. ఇప్పటికే నివాస పాఠశాలల్లో ఆహార విషబాధ ఘటనలు, మరణాలు జరిగినప్పటికీ అధికారులు సరైన చర్యలు తీసుకోవడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. హాస్టల్ సిబ్బంది కూడా కనీస బాధ్యత చూపడం లేదని, విద్యార్థులు అనారోగ్యానికి గురైన సమయంలో ఏఎన్‌ఎంలు అందుబాటులో లేకపోవడం దురదృష్టకరమని తెలిపారు. విద్యార్థుల భద్రత కోసం వెంటనే చర్యలు తీసుకోవాలని, ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని వైయ‌స్ఆర్‌ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. ఈ సందర్శనలో స్థానిక ప్రజాప్రతినిధులు, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఐటిడీఏ ప్రాజెక్టు అధికారి కూడా పరిస్థితిని సమీక్షించారు.