అబద్ధపు కూటమి ప్రభుత్వానికి కాలం చెల్లిపోయింది
ఉదయగిరి నియోజకవర్గం: ప్రజలను మోసం చేసిన అబద్ధపు కూటమి ప్రభుత్వానికి కాలం చెల్లిపోయిందని, రానున్న కాలం పూర్తిగా రాజన్న రాజ్యమేనని, మళ్లీ జగనన్న ప్రభుత్వమే ఏర్పడుతుందని ఉదయగిరి నియోజకవర్గ వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇన్‌చార్జ్ మేకపాటి రాజగోపాల్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, చంద్రబాబు నాయుడిని ఇకపై ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని స్పష్టం చేశారు. అబద్ధాలు, మోసాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ప్రజల ఆశలను వమ్ము చేసిందని ఆరోపించారు. ప్రజలు ఇప్పటికే వాస్తవాన్ని గ్రహించారని, తగిన సమయంలో తగిన తీర్పు ఇస్తారని తెలిపారు.
పార్టీ శ్రేణులు అధైర్యపడాల్సిన అవసరం లేదని, మరో మూడు సంవత్సరాలు అందరూ కలసి కట్టుగా పార్టీ కోసం పనిచేయాలని పిలుపునిచ్చారు. కష్టకాలంలో పార్టీకి అండగా నిలిచిన కార్యకర్తలను జగనన్న ముఖ్యమంత్రి అయ్యాక భుజాన మోస్తామని హామీ ఇచ్చారు. పదవులు అలంకార ప్రాయమని కాకుండా బాధ్యతగా భావించాలని సూచించారు. పదవులు తీసుకున్న ప్రతి ఒక్కరూ జగనన్నను మళ్లీ ముఖ్యమంత్రిని చేయడమే లక్ష్యంగా అలుపెరగకుండా పనిచేయాలని ఆదేశించారు. పార్టీ బలోపేతం, సంస్థాగత నిర్మాణం పటిష్టతే ప్రధాన ధ్యేయంగా ముందుకు సాగాలని అన్నారు. ఈ సమావేశంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొని, పార్టీ విజయానికి కట్టుబడి పనిచేస్తామని నినాదాలతో తమ సంకల్పాన్ని వ్యక్తం చేశారు.