2029లో మహిళా రిజర్వేషన్ అమలును స్వాగ‌తిస్తున్నా

25 Mar, 2026 16:28 IST

తాడేప‌ల్లి: మహిళా రిజర్వేషన్ చట్టం–2023కు ప్రతిపాదిత సవరణలను వైయ‌స్ఆర్‌సీపీ హృదయపూర్వకంగా సమర్థిస్తున్నట్లు పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్య‌మంత్రి శ్రీ‌ వైయ‌స్ జగన్ మోహన్ రెడ్డి గారు తెలిపారు. ఈ సవరణలతో 2029 నాటికి చట్టం అమలులోకి రావడం ఒక కీలక ముందడుగని ఆయన అభిప్రాయపడ్డారు. అసెంబ్లీ, లోక్‌సభల్లో మహిళలకు 33 శాతం రాజకీయ ప్రాతినిధ్యం కల్పించే ఈ చర్యను ఆయన స్వాగతించారు. ప్రజాస్వామ్యంలో ప్రతి స్థాయిలో మహిళలు నాయకులుగా ఎదగడం వైయ‌స్ఆర్‌సీపీ లక్ష్యమని స్పష్టం చేశారు. ఈ మేర‌కు ఆయ‌న త‌న ఎక్స్ ఖాతాలో ట్వీట్ చేశారు.

మహిళల సాధికారతకు వైయ‌స్ఆర్‌సీపీ ఎప్పటినుంచో ప్రాధాన్యత ఇస్తోందని వైయ‌స్ జగన్ పేర్కొన్నారు. స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవులు, అలాగే నామినేషన్ ప్రాతిపదికన ఇచ్చే పనులు, సేవా కాంట్రాక్టుల్లో 50 శాతం రిజర్వేషన్లు అమలు చేసి దేశానికి మార్గదర్శకంగా నిలిచామని గుర్తుచేశారు.

దేశ ప్రధాని నరేంద్ర మోదీ తీసుకొచ్చిన ఈ నిర్ణయం మహిళల శక్తివంతీకరణకు తోడ్పడుతుందని వైయ‌స్ జగన్ అభిప్రాయపడ్డారు. మహిళలు అన్ని రంగాల్లో ముందుకు రావాలని, సమాన హక్కులతో రాజకీయాల్లోనూ కీలక పాత్ర పోషించాలని శ్రీ వైయ‌స్ జ‌గ‌న్ మోహ‌న్ రెడ్డి గారు ఆకాంక్షించారు.