చంద్రబాబుది ఏకంగా క్రెడిట్ దోపిడి
తాడేపల్లి: చంద్రబాబు ఏకంగా క్రెడిట్ దోపిడి చేస్తున్నారని, ఆ దిశలోనే ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ కంపెనీ తామే తెచ్చినట్లు బిల్డప్ ఇస్తూ ఆర్భాటంగా ప్రచారం చేసుకున్నారని మాజీ ముఖ్యమంత్రి, వైయస్ఆర్‌సీపీ అధ్యక్షుడు శ్రీ వైయస్ జగన్‌మోహన్‌రెడ్డి తేల్చి చెప్పారు. నిజానికి 2022లో తన దావోస్ పర్యటనలో ఆదిత్య మిట్టల్‌ను కలిశానని, రాష్ట్రంలో స్టీల్ ప్లాంట్ ఏర్పాటుపై అప్పుడే దాదాపు అవగాహన కుదిరిందని, తగిన భూమి ఇచ్చేందుకు కూడా అంగీకరించామని, అంతే కాకుండా అప్పుడే ఆ కంపెనీ కర్నూలు జిల్లాలో నిర్మాణంలో ఉన్న గ్రీన్‌కో ప్రాజెక్టులోనూ రూ.4800 కోట్ల పెట్టుబడికి అవగాహన కదుర్చుకుందని ఆయన వెల్లడించారు.
అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గ వైయస్ఆర్‌సీపీ స్ధానిక సంస్ధల ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలతో పార్టీ కేంద్ర కార్యాలయంలో సమావేశమైన శ్రీ వైయస్ జగన్, కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఆర్సెనాల్ మిట్టల్ స్టీల్ కంపెనీ గురించి అంతగా ప్రచారం చేసుకుంటున్న సీఎం చంద్రబాబు, అదే నక్కపల్లిలోని బల్క్ డ్రగ్ పార్క్ ప్రాజెక్ట్ గురించి ఎందుకు మాట్లాడడం లేదని ప్రశ్నించారు. అసలు ఆ ప్రాజెక్టు ఏమైందని నిలదీశారు. దురుద్దేశంతో అక్కడ భూవివాదాన్ని సృష్టించిన చంద్రబాబు, దాన్ని ముందుకు సాగనివ్వడం లేదని చెప్పారు.
జగన్ 2 లో పార్టీ కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తామన్న శ్రీ వైయస్ జగన్, నియోజకవర్గాల పెంపు ఒక గుడ్‌న్యూస్ అని చెప్పారు. అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల పెంపు హర్షణీయం అన్న ఆయన, దాని వల్ల ఎస్సీ, ఎస్టీ, మహిళలకు సీట్లు కూడా గణనీయంగా పెరుగుతాయని తెలిపారు. ఇంకా దాని వల్ల కార్యకర్తలు కూడా నాయకులుగా ఎదిగే అవకాశం వస్తుందని, ఉత్సాహం. పటిమ ఉన్న వారికి ప్రోత్సాహం ఇస్తామని చెప్పారు.
ఇంకా ఈ సమావేశంలో శ్రీ వైయస్ జగన్ ఏం మాట్లాడారంటే..:
నియోజకవర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తున్న విషయం మీకు తెలిసిందే. కొన్ని ముఖ్యమైన నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతున్నాం. అందులో భాగంగా ఈరోజు అద్దంకి నియోజకవర్గం నాయకులు, కార్యకర్తలతో సమావేశం అవుతున్నాం. 2019 ఎన్నికల్లో మనం 151 సీట్లు గెల్చుకున్నా, అద్దంకిలో గెలవలేకపోయాం.
కాగా, ఇప్పుడు ఆ నియోజకవర్గంలో మంత్రిపై తీవ్ర వ్యతిరేకత ఉంది. చంద్రబాబుకన్నా ఇంకా ఎక్కువ వ్యతిరేకత ఇప్పటి మంత్రిపై ఉంది. అద్దంకి నియోజకవర్గంలో డాక్టర్ అశోక్‌కుమార్‌ను తీసుకొచ్చాం. ఆయన మంచి డాక్టర్. రాక్షస రాజ్యంలో మనం ఉన్నాం, కాబట్టి చాలా పోరాడాల్సి ఉంటుందని తెలిసినా, అశోక్ ముందుకొచ్చాడు. 5 ఏళ్లు పోరాటానికి సిద్ధమయ్యాడు. కార్యకర్తలకు తోడుగా నిలబడుతున్నాడు.
చంద్రబాబు దగా. పచ్చి మోసం:
ఈరోజు రాష్ట్రంలో పరిస్థితి ఏమిటన్నది నా కంటే మీరే బాగా చెప్పగలరు. ఎన్నికల ముందు చంద్రబాబు ఏం చెప్పారు? ఆ తర్వాత ఏం చేస్తున్నాడు.. అందరికీ తెలుసు. నాడు ఆయన ఏమన్నాడు. జగన్ ఇస్తున్నవన్నీ అలాగే అమలు చేయడమే కాకుండా, సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ కూడా ఇస్తానన్నాడు. కానీ, ఆ తర్వాత ఏం చేశారు? ఎన్నికలై పోగానే చంద్రబాబు మ్యానిఫెస్టోను చెత్తబుట్టలో వేశారు. ఇప్పుడు మూడు బడ్జెట్లు అయిపోయాయి. ఇంకా మిగిలినవి కేవలం రెండు మాత్రమే. కానీ ఏ పథకం అమలు లేదు. జగన్ ఇచ్చినవన్నీ పోయాయి. అన్నీ ఎగ్గొట్టాడు. చివరకు సూపర్‌సిక్స్, సూపర్‌సెవెన్ కూడా మోసాలయ్యాయి. బిర్యానీ కథ దేవుడెరుగు. ఉన్న పలావు పోయింది. దీన్ని ప్రజలు ఇంటింటా చర్చించుకుంటున్నారు.
అంతా దోచుకో. తినుకో. పంచుకో (డీటీపీ):
మన హయాంలో ఆ 5 ఏళ్లలో దాదాపు రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే, అందులో రూ.2.73 లక్షల కోట్లు, డీబీటీ ద్వారా అక్కచెల్లెమ్మల ఖాతాలకు నేరుగా బదిలీ చేశాం. ఆధార్ నెంబర్లు, బ్యాంక్ ఖాతాలతో సహా ఎవరికి, ఎంతిచ్చామో చెప్పగలం. కానీ రెండేళ్లు కూడా కాకముందే చంద్రబాబు చేసిన మొత్తం అప్పులు రూ.3.37 లక్షల కోట్లు దాటాయి. కానీ, జగన్ ఇచ్చిన పథకాలు లేవు. ఇంకా సూపర్‌సిక్స్, సూపర్ సెవెన్ కూడా లేవు.
మరి నాడు, జగన్ ఎలా చేశాడు. మరి ఇప్పుడు చంద్రబాబు హయాంలో ఎందుకు చేయడం లేదు అన్నదానిపై ప్రతి ఇంట్లో చర్చ జరుగుతోంది. చంద్రబాబు ఎందుకు ఇవ్వడం లేదు అంటే.. ఇప్పుడంతా దోచుకో. తినుకో. పంచుకో. ఎక్కడ పడితే అక్కడ దోపిడి. రాష్ట్ర ఖజానాకు ఆదాయం రావడం లేదు. అదంతా చంద్రబాబు, ఆయన బినామీలు, ఆ పార్టీ నేతలు, ఎమ్మెల్యేల జేబుల్లోకి పోతోంది. లిక్కర్ మొదలు ప్రతి చోటా దోపిడి. ఎక్కడా ఎమ్మార్పీకి మద్యం అమ్మడం లేదు. వేలం పాటలు నిర్వహించి, బెల్టు షాపులు నడుపుతున్నారు. మద్యం అధిక ఆదాయం ప్రభుత్వానికి రావడం లేదు. అంతా మాఫియాకు చేరుతోంది. ఇంకా ఇసుక, మట్టి, ల్యాటరైట్.. దేన్నీ వదలడం లేదు.
మరోవైపు అధిక ధరలకు పీపీఏలతో అవినీతికి పాల్పడుతున్నారు. మనం యూనిట్ విద్యుత్ రూ.2.49కే పీపీఏ చేసుకుంటే, ఇప్పుడు రూ.4.60కి చేసుకుంటున్నారు. మనం రైతులకు ఉచిత విద్యుత్ 25 ఏళ్లు ఇవ్వాలని సంకల్పించి, యూనిట్ విద్యుత్‌ను రూ.2.49కే చేసుకుంటే విమర్శించారు. కానీ వీరు ఏకంగా యూనిట్ విద్యుత్‌ను రూ.4.60 చొప్పున పీపీఏ చేసుకున్నారు.
అమరావతిలో చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేలు ఖర్చు చేస్తున్నారు. బెంగళూరు, హైదరాబాద్ వంటి మహానగరాల్లో చదరపు అడుగు నిర్మాణానికి రూ.4 వేలతో ఫైవ్‌స్టార్ లెవెల్‌లో కట్టొచ్చు. కానీ ఇక్కడ ఏకంగా అదే చదరపు అడుగు నిర్మాణానికి రూ.11 వేలు ఖర్చు చేస్తున్నారు. ఇంకా భూములు శనక్కాయలు, బెల్లానికి ఇస్తున్నారు. చంద్రబాబు బంధువు, బాలకృష్ణ అల్లుడికి రూ.5 వేల కోట్ల విలువైన భూములు దోచి పెడుతున్నారు. ఈ రకంగా రాష్ట్ర ఆదాయాలు రాష్ట్రానికి రావడం లేదు.
పరిపాలన లేదు. వ్యవస్థలన్నీ కుప్పకూలాయి:
చంద్రబాబు ప్రభుత్వంలో అసలు పరిపాలన అనేది లేదు. అన్ని వ్యవస్థలు కుప్పకూలాయి. ఫీజు రీయింబర్స్‌మెంట్ లేక, పిల్లలు చదువులకు దూరం అవుతున్నారు. బకాయిలతో కలిపి ఈ ఏడాది విద్యాదీవెన, వసతి దీవెనకు సుమారు రూ.10 వేల కోట్లు కావాలి. కానీ ఈ ఏడాది బడ్జెట్‌లో పెట్టింది రూ.2,600 కోట్లు మాత్రమే. ఆరోగ్యశ్రీకి రూ.3,150 కోట్లు బకాయి పెట్టారు. దీంతో నెట్‌వర్క్ ఆస్పత్రులు పథకంలో వైద్యం చేయడం లేదు.
నాడు–నేడు మనబడి లేదు. ఇంగ్లిష్ మీడియమ్ లేదు. మూడో తరగతి నుంచి టోఫెల్ శిక్షణ లేదు. పిల్లలకు ట్యాబ్‌లు లేవు. గోరుముద్దలో క్వాలిటీ లేదు. చదువులు పూర్తిగా తిరోగమనంలో ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో చేరికలు తగ్గిపోతున్నాయి.
విద్య, వైద్యం పరిస్థితి ఇలా ఉంటే.. రైతుల పరిస్థితి మరీ దారుణం. ఏ పంటకూ గిట్టుబాటు ధర రావడం లేదు. రైతుల గురించి పట్టించుకునే పరిస్థితి లేదు. అంత దారుణంగా వ్యవసాయం ఉంది.
మండుతున్న ధరలు. పట్టని ప్రభుత్వం:
పూర్తిస్థాయిలో యుద్ధం జరగకముందే దాని పేరు చెప్పి ధరలు దారుణంగా పెంచారు. వంట నూనె లీటరు రూ.40 పెరిగింది. యుద్ధం పేరు చెప్పి ధర పెంచేశారు, పప్పులు కేజీకి రూ.15 నుంచి రూ.20 వరకు పెరిగాయి. ఉచిత గ్యాస్‌కు దిక్కులేదు. మరోవైపు గ్యాస్ సిలిండర్లు ఇప్పటికే బ్లాక్‌లో అమ్ముతున్నారు. సిలిండర్ రూ.2 వేలు, రూ.3 వేలకు అమ్ముతున్నారు.
పరిస్థితి ఇలా ఉంటే, ఈ పెద్దమనిషి ఏమంటున్నాడు. కిరోసిన్ ఇస్తాడంట. లీటరు కిరోసిన్ ఇస్తాడంట. పండగ చేసుకోమంటున్నాడు.
అసలు కిరోసిన్ స్టవ్‌లు ఎక్కడున్నాయి. చివరకు గుడ్ల ధర కూడా పడిపోయింది. మొక్కజొన్న కనీస మద్దతు ధర (ఎమ్మెస్పీ) రూ.2,400 ఎమ్మెస్పీ అయితే రూ.1,400 కూడా అడిగే వాడు లేడు. ఇంకా కొకో, అరటి, శనగ, టమోటా.. ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు. రైతుల పరిస్థితి ఇదీ.
చంద్రబాబు క్రెడిట్ దోపిడి:
చంద్రబాబు పాలనంతా వైఫల్యం. కానీ, మాటలు కోటలు దాటుతాయి. కానీ చేతలుండవు. ఆయన చేస్తున్న దాన్ని క్రెడిట్ చోరీ కాకుండా క్రెడిట్ దోపిడి అనాలేమో. చంద్రబాబు ఇటీవలి క్రెడిట్ దోపిడి గురించి చెప్పాల్సి వస్తే.. ఆర్సెలార్ మిట్టల్ స్టీల్ ప్లాంట్‌ను తాను తెచ్చినట్లు బిల్డప్ ఇస్తూ.. ఆర్భాటంగా జోరుగా ప్రచారం చేసుకుంటున్నాడు. చంద్రబాబు క్రెడిట్ దోపిడికి కనీసం హద్దు ఉండాలి.
ఆదిత్య మిట్టల్‌ను 2022లో నేను దావోస్‌లో కలిశాను. అప్పట్లోనే ఇక్కడి గ్రీన్‌కో ప్రాజెక్టులో పెట్టుబడికి కూడా రెడీ అయ్యారు. రూ.4,800 కోట్ల పెట్టుబడితో ఆ ప్రాజెక్టులో వారు భాగస్వాములయ్యారు. కర్నూలు జిల్లాలో కడుతున్న పంప్డ్ స్టోరేజీ ప్లాంట్‌లో ఆ పెట్టుబడి పెట్టారు. ఇంకా అప్పట్లోనే ఎస్సార్ స్టీల్ వారు కొనుగోలు చేసి, రూ.1000 కోట్ల పెట్టుబడితో విస్తరణకు రెడీ అయ్యారు. ఆ మేరకు అగ్రిమెంట్లు కూడా జరిగాయి.
అవే కాకుండా, ఇక్కడ కొత్త స్టీల్ ప్లాంట్ పెట్టాలని ఆహ్వానించి, వారికి తగిన భూములు చూపాలని అధికారులను ఆదేశించాను.
దాంతో అధికారులు కాకినాడ సెజ్‌లో, మూలపేట, నక్కపల్లిలో భూములు చూపితే, వారికి నక్కపల్లి నచ్చింది. అక్కడ మనకు ఏపీఐఐసీ భూములుంటే, వాటిలో 2,200 ఎకరాలు ఇవ్వడానికి సిద్ధమయ్యాం. ఆలోగా ఎన్నికలు వచ్చాయి. ప్రభుత్వం మారింది. దాన్ని చంద్రబాబు ముందుకు తీసుకెళ్లాడు. ఒక జూమ్ కాల్‌తో మిట్టల్ కంపెనీ వచ్చినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. అసలు మిట్టల్ అనేవాడు చంద్రబాబు సుందర ముఖార విందాన్ని చూసి వచ్చినట్లు బిల్డప్ ఇస్తున్నాడు.
విశాఖలో అదానీ డేటా సెంటర్ కూడా అంతే. అది మన హయాంలోనే వచ్చింది. అది కూడా తానే తెచ్చినట్లు చంద్రబాబు ప్రచారం.
ఇక్కడ ఆశ్చర్యకరమైన మరో విషయం. అదే నక్కపల్లిలో 2023లో బల్క్ డ్రగ్ పార్కును 13 రాష్ట్రాలలో పోటీ పడి తెచ్చాం. కేంద్రం రూ.1000 కోట్లు ఇవ్వడానికి కూడా సిద్ధమైంది.
కానీ, చంద్రబాబు వచ్చాక, ఆ బల్క్ డ్రగ్ పార్క్ పనులు జరగడం లేదు. అడుగులు ముందుకు పడడం లేదు. దాని వల్ల లక్షల కోట్లు పెట్టుబడులు వస్తాయి. ఉద్యోగాలూ వస్తాయి. అయినా భూముల పేరుతో వివాదాస్పదం చేశారు. దాంతో ఆ పనులు నిల్చిపోయాయి. అలా కొన్ని ప్రాజెక్టుల పని చేయడం లేదు.
పోర్టుల్లో పనుల నిలిపివేత:
నాడు మన ప్రభుత్వంలో మూడు పోర్టుల పనులు వేగంగా చేశాం. నిధుల సమీకరణ ప్రక్రియ కూడా పూర్తి చేశాం. రామాయపట్నం పోర్టు దాదాపు 80 శాతం పూర్తి చేశాం. మూలపేట పోర్టు పనులు 30 శాతం పూర్తి చేశాం.మచిలీపట్నం పోర్టు 30 శాతం మన హయాంలోనే పూర్తి చేశాం. కానీ, ఈ మూడింటి పనులు ఆగిపోయాయి. ఎందుకంటే, జగన్‌కు పేరు రావొద్దని పనులు ఆపారు.
ఇప్పుడు ఆ చుట్టుపక్కల భూములను చంద్రబాబు తన వారితో కొనిపిస్తున్నాడు. అప్పటి వరకు పోర్టుల పనులు ఆపేశారు. ఇప్పటికే భూములు ఇచ్చామని, ఇంకా భూములు లేవని మచిలీపట్నం పోర్టు వద్ద అక్కడి రైతులు ఆవేదన చెందుతున్నారు.
ఇలా ప్రతి అడుగులోనూ నాకేమిటి అంటూ చంద్రబాబు దోచుకోవడమే. ఆ దిశలోనే ఈ ప్రభుత్వం అడుగులు వేస్తోంది. ఇలాంటి వాతావరణంలో రేపు 2029 ఎన్నికలు జరగబోతున్నాయి.
అసెంబ్లీ, పార్లమెంటు సీట్ల పెంపు. గుడ్‌న్యూస్:
గుడ్‌న్యూస్ ఏమిటంటే.. రాష్ట్రంలో అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గాల సీట్లు పెరుగుతున్నాయి. అసెంబ్లీ సీట్లు 175 నుంచి 263కి, పార్లమెంటు నియోజకవర్గాలు 25 నుంచి 38కి పెరగనున్నాయి. అలాగే వాటిలో ఎస్సీ ఎస్టీలకు 50 శాతం సీట్లు పెరుగుతాయి. ఇంకా మహిళలకు 33 శాతం చొప్పున అసెంబ్లీలో 88 సీట్లు, 13 ఎంపీ సీట్లు దక్కనున్నాయి.
నాడు మన ప్రభుత్వ హయాంలో మహిళలకు నామినేటెడ్ పదవుల్లో 50 శాతం ఇచ్చాం. అందుకోసం చట్టం కూడా చేశాం. ఆ విధంగా మహిళలకు సాధికారత ఇచ్చాం.
జగన్ 2 లో కార్యకర్తలకు ప్రాధాన్యం:
ఇప్పుడు 2029లో ఎమ్మెల్యే, ఎంపీ సీట్లు పెరుగుతాయి దీని వల్ల కార్యకర్తల నుంచి లీడర్లు ఎదుగుతారు. నాయకత్వ పటిమ చూపే వారికి, అడుగులు వేయడానికి సిద్ధమవుతారో అందరికీ జగన్ న్యాయం చేస్తాడు.
ఈసారి జగన్ 2 లో కార్యకర్తలకు అత్యధిక ప్రాధాన్యం ఇస్తాం.
నాడు మన హయాంలో రెండేళ్లు కోవిడ్ వల్ల కార్యకర్తలపై దృష్టి పెట్టలేకపోయాం. పాలన, బటన్ నొక్కడంపై ఎక్కువ ధ్యాస పెట్టాల్సి వచ్చింది. మీ అందరికీ భరోసా ఇస్తున్నాను. ప్రజలకు ఇంకా మంచి చేయడమే కాకుండా, కార్యకర్తలకు కూడా మంచి జరుగుతుంది. జగన్ 2 లో ప్రజలకు మంచి చేసే కార్యక్రమం మీ ద్వారానే జరుగుతుంది. కాబట్టి, రాబోయేవి చాలా మంచి రోజులు.
ఇప్పటికే రెండేళ్లు గడిచాయి. ఇంకా మిగిలింది మూడేళ్లు. అందులో చివరి ఏడాదిన్నర నేను పాదయాత్రలో ఉంటాను. దాంతో మొత్తం పార్టీ ప్రజల కోసం నేరుగా రంగంలోకి దిగుతుంది. అప్పుడు చంద్రబాబుకు సినిమా చూపిస్తాం. కాగా, చంద్రబాబు చేసే రెడ్‌బుక్ పాలన, అన్యాయాలకు టైమ్ దగ్గరకొచ్చిందని, ఇంకా వాటి గురించి భయపడాల్సిన అవసరం లేదని శ్రీ వైయస్ జగన్ స్పష్టం చేశారు.
బాపట్ల జిల్లా పార్టీ అధ్యక్షుడు మేరుగు నాగార్జున, అద్దంకి అసెంబ్లీ నియోజకవర్గం ఇంఛార్జ్ డాక్టర్ చింతలపూడి అశోక్‌కుమార్‌తో పాటు, నియోజకవర్గంలో పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు, నాయకులు, ముఖ్య కార్యకర్తలు ఈ సమావేశంలో పాల్గొన్నారు.